Chandrababu Meeting with TDP Leaders: తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సీనియర్ నేత ఆలపాటి రాజా భేటీ సహృద్భావ వాతావరణంలో ముగిసింది. పొత్తులో భాగంగా జరిగిన తెనాలి సీటు సద్దుబాటును అర్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించగా, పొత్తుల్ని, పార్టీ నిర్ణయాల్ని గౌరవించే వ్యక్తిని తానని రాజా బదులిచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని, తగు ప్రత్యామ్నాయం కల్పిస్తానని ఆలపాటి రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
తరువాత లోకేశ్‌ని కలిసిన ఆలపాటి రాజా చంద్రబాబుతో భేటీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో భేటీ మంచి వాతావరణంలో జరిగిదంటూ లోకేశ్ వద్ద ఆలపాటి రాజా తన సంతృప్తి వ్యక్తం చేశారు. పీలా గోవింద్, బీకే పార్ధసారధి తదితర సీటు దక్కని నేతలకు చంద్రబాబు నుంచి పిలుపువెళ్లింది. ఇవాళ, రేపో సీటు రాని ఆశావహులు చంద్రబాబుని కలవనున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి భేటీ మంచి వాతావరణంలో ముగిసింది. పొత్తులో భాగంగా రాజానగరం నియోజకవర్గం జనసేనకు కేటాయించగా, అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను పవన్ కల్యాణ్ ప్రకటించారు. బొడ్డు వెంకట రమణ రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో రాజమండ్రి ఎంపీ స్థానం లేకుంటే వేరే ప్రత్యామ్నాయం తప్పక పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీపై వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్
దేవినేని ఉమామహేశ్వరరావుతో: తొలి జాబితాలో చోటు దక్కని దేవినేని ఉమామహేశ్వరరావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తొలి జాబితాలో పేరు లేకపోవడంపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే పేరు ప్రకటించలేదని ఉమాతో చంద్రబాబు చెప్పారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినన్న ఉమా, ఆయన మాటే శిరోధార్యమన్నారు.
గంటా శ్రీనివాసరావుతో: గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబుని కలిశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు తనకు సూచించారని, భీమిలి నుంచి పోటీ చేస్తానని తాను చెప్పానని గంటా తెలిపారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు తనతో అన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్న గంటా, మొదటి జాబితాపై ప్రజా స్పందన బాగుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడటం అంతే నిజం అని గంటా తెలిపారు.
తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదని, పొత్తుల వల్ల సీట్లు దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు టీడీపీ - జనసేన అంతర్గత వ్యవహారం అని పేర్కొన్న గంటా, చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని, 70 మందిని ప్రకటించడానికి వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిందని ఎద్దేవా చేశారు.
పీలా గోవింద్‌తో: అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన పీలా గోవింద్ అయ్యన్నపాత్రుడితో కలిసి చంద్రబాబుని భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున్న పరిస్థితి అర్థం చేసుకోవాలని పీలాతో చంద్రబాబు అన్నారు. సముచిత న్యాయం చేస్తామన్న చంద్రబాబు, సీటు విషయమై మళ్లీ మాట్లాడదామన్నారు.
అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడను: చంద్రబాబు