BANDI SANJAY VISIT MARRIMADLA EKALAVYA SCHOOL : విద్యార్థులకు అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను మంత్రి సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారంటూ విద్యార్థులను అడగడంతో పాటు ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని చెబుతున్నారని, మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా? అని ప్రశ్నించారు. టాయిలెట్లో నీళ్లు రాకపోతే పట్టించుకోరా అని అడిగారు. మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నానని, రెండోసారి వచ్చిన సమయంలో ఇలా ఉండకూడదని సున్నితంగా హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా 728 పాఠశాలలు : అనంతరం టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ తన పరిధిలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. 2018-19లో దేశవ్యాప్తంగా బ్లాక్‌ల వారీగా 50 శాతం ఎక్కువ ఉన్న ఆదివాసీ గిరిజన ఎస్సీ, ఎస్టీ బ్లాకుల్లో ఏకలవ్య పాఠశాలను కేంద్రం మంజూరు చేయాలని నిర్ణయించిందన్నారు. 2022లో 20 శాతం జనాభా ఉన్న బ్లాకుల్లో కూడా ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 728 పాఠశాలను ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటివరకు 410 పాఠశాలల్లో విద్యా బోధన కొనసాగుతుందని చెప్పారు.
వారిలోని ప్రతిభను వెలికి తీయడం కోసమే : దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 1.20 లక్షలకు పైగా మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. పాఠశాలల భవన నిర్మాణానికి రూ.38 కోట్లు వెచ్చిస్తుండగా, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.48 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలల్లో 8,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు చెప్పారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్లలోని ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు, సూచనలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ - రాష్ట్రంలో వరదల పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన బండి సంజయ్