Central Govt Approves New Railway Line To Amaravati : ఐదేళ్లపాటు అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ రాకతో ప్రగతి బాటలో పరుగులు పెడుతోంది. ఇప్పటికే రాజధాని, పోలవరం నిర్మాణాలకు సహకరిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అమరావతికి కొత్త రైల్వే ప్రాజెక్టుని ప్రకటించింది. 2,245 కోట్లతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ 57 కిలోమీటర్ల రైల్వేలైన్‌తో కీలక నగరాలతో అమరావతికి అనుసంధానం ఏర్పడనుంది.
57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణం : రాజధాని అమరావతి మీదుగా నిర్మించతలపెట్టిన కొత్త రైల్వేలైన్‌కు కీలక ముందడుగు పడింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పనులు వేగంగా పట్టాలెక్కనున్నాయి. అమరావతిపై కక్ష కట్టిన జగన్ సర్కార్ ఈ రైల్వేలైన్‌ను పూర్తిగా తొక్కిపెట్టింది. దీంతో రైల్వే శాఖ కూడా ఏటా బడ్జెట్‌లో మొక్కుబడిగా కేవలం వెయ్యి రూపాయల చొప్పున కేటాయిస్తూ వచ్చింది.
ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు - అమరావతి రైల్వే లైన్ మ్యాప్ చూశారా?
రైల్వేలైన్‌కు ఊపిరి : ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో ఈ రైల్వేలైన్‌కు ఊపిరి వచ్చింది. దీనికి అవసరమైన భూసేకరణ చేసేందుకు ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తిస్తూ జూన్‌లో రైల్వే శాఖ గెజిట్ ప్రచురించింది. డీపీఆర్‌కు రైల్వే బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేంద్రం ఆమోదంతో భూసేకరణ ఆరంభించడంతో పాటు, టెండర్లు పిలిచి, పనులు మొదలుపెట్టేందుకు వీలు కలిగినట్లయింది. ఈ రైల్వేలైన్‌కు గుంటూరు, పల్నాడు, గుంటూరు, ఖమ్మం పరిధిలో దాదాపు 450 హెక్టార్ల భూసేకరణ చేయనున్నారు. కొత్తగా అమరావతి సహా 9 స్టేషన్లు నిర్మించనున్నారు.
రాజధానికి రైలు వరం : ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు కీలక నగరాలను దక్షిణాది నగరాలకు అనుసంధానం చేసేందుకు ఈ రైల్వేలైన్ అత్యంత కీలకం కానుంది. అమరావతి మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు, ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ వంటి నగరాలకు, దక్షిణాదిలో (South india) చెన్నైతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పలు నగరాలకు రైళ్లు పరుగులు పెడతాయి. ప్రస్తుతం దిల్లీ, ముంబయి నుంచి చెన్నై వైపు వచ్చి వెళ్లే రైళ్లు కాజీపేట వైపు నుంచి విజయవాడ వచ్చి అక్కడి నుంచి హౌరా- చెన్నై(Howrah to Chennai) మెయిన్ లైన్‌లో తెనాలి మీదుగా చెన్నై వైపు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ - 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు మంజూరు
ఎర్రుపాలెం నుంచి నంబూరు : ఈ లైన్ నిర్మాణం పూర్తయితే కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్‌లోకి వచ్చి అమరావతి మీదుగా నంబూరు చేరుకుంటాయి. అక్కడి నుంచి న్యూ గుంటూరు (New Guntur) స్టేషన్ మీదుగా హౌరా- చెన్నై ప్రధాన లైన్‌లోని తెనాలి వద్ద కలిసి చెన్నై వైపు వెళతాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన ప్రధాని, రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ మీదుగా నిత్యం సగటున 250 రైళ్ల రాపోకలు సాగిస్తుండటంతో ఈ స్టేషన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమరావతి లైన్ అందుబాటులోకి వస్తే అనేక రైళ్లు దానిమీదుగా మళ్లించేందుకు వీలుంటుంది.
ఆ రైల్వే స్టేషన్లకు నూతన సొబగులు - విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దేలా హంగులు