Central Government Approves Hyderabad Bangalore Highway Expansion : రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో దాని వెంబడి అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
రహదారుల వెంటే అభివృద్ధి : ఏ రాష్ట్రంలో అయినా అక్కడి రహదారులు, మౌలిక వసతులను బట్టి పెట్టుబడులు తరలివస్తాయి. పరిశ్రమలు వరుస కడతాయి. విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాలపై దృష్టిపెడతారు. దీనికితోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీపడతారు. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది. దీంతో కర్నూలు, నంద్యాల అనంతపురం జిల్లాలకు ఈ ప్రయోజనాలన్నీ త్వరలో కలగనున్నాయి.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇప్పుడీ హైవే వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటవుతాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాలవైపు వచ్చే వీలుంది. కర్ణాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు హైవే వెంబడి దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది. ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, విద్యుత్, నీటి కొరత లేకపోవవడంతో పారిశ్రామికవేత్తలు దృష్టిపెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరుగుతాయి. తెలంగాణ వైపు కూడా భూముల ధరలు అధికంగానే ఉండటంతో అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయానుకునే వారు కర్నూలు జిల్లాలో హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమీపంలో భూములను ఎంపిక చేసుకునేందుకు వీలుకలుగుతుంది.
రోడ్డుపై పెద్దిరెడ్డి పెత్తనం - ప్రజలు తిరగకుండా గేట్లు ఏర్పాటు - Peddireddy occupied Tirupati road
నాలుగు విమానాశ్రయాలకు దగ్గర : ఈ హైవేలో మన రాష్ట్రంలోని కర్నూలు వద్ద మొదలై శ్రీసత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదగా ఈ హైవే వెళ్తుంది. ఈ జాతీయ రహదారికి సమీపంలో నాలుగు విమానాశ్రయాలు ఉండటంతో పారిశ్రామికవేత్తలు దీని వెంబడి పరిశ్రమలు ఏర్పాటుకు మొగ్గు చూపేందుకు వీలుంది. బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ-కర్ణాటక సరిహద్దు నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెనుకొండ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్ విమానాశ్రయం ఉంది. కర్నూలు నుంచి తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం 195 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు.
పారిశ్రామిక హబ్స్‌గా సీమ జిల్లాలు : ఇప్పటికే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ ఏర్పాటైంది. బీహెచ్ఈఎల్(BHEL) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు కృషితో పెనుకొండ వద్ద కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత స్వరూపమే మారిపోయింది. పెనుకొండ నుంచి పాలసముద్రం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర 18 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. విద్యుత్ బస్‌ల తయారు చేసే వీర బస్, విమానాల విడిభాగాలు తయారు చేసే ఎయిర్‌బస్ ఆ ప్రాంతంలోనే భూములు కేటాయించారు. జాతీయ రహదారి 12 వరుసలతో విస్తరణతో పెద్ద సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ హైవే వెంబడి ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో ఏపీఐఐసీ (APIIC) పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటుచేస్తే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలకు వరుస కడతాయి.