Case Against EX DCP Radhakishan Rao : మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు(Radhakishan Rao) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయనతో పాటు, మరో ఎనిమిది మందిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్త ఫిర్యాదు మేరకు, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హర్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకుని వరల్డ్ బ్యాంకులో పనిచేసిన తాను, 2011లో క్రియా పేరుతో హెల్త్‌కేర్ సర్వీస్‌ను ప్రారంభించిట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వంలో 165 హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రభుత్వ హెల్త్‌కేర్ సెంటర్లలో పలు రకాల సేవలు అందించారని వేణుమాధవ్ పేర్కొన్నారు. వీటితో పాటు ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్టు తమకు వచ్చిన సమయంలో, పార్ట్‌టైమ్ డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవిలను నియమించుకున్నామని, బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా పెట్టామని తెలిపారు. ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే తనకు తెలిసిన వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని, డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం పరుచుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. తాను ఒప్పుకోకపోడంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు(CI Gattumallu), ఎస్‌ఐ మల్లిఖార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి, డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు.
చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 100కోట్ల తన కంపెనీని అతని పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మీడియాకి, ఉన్నతాధికారులకు చెప్తే వేరే పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. సిఐ గట్టుమల్లు అతని బృందానికి 10లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రాధాకిషన్ అరెస్ట్ వార్తలు విని, ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై నిందితులపై చర్యాలు తీసుకోవాలని కోరారు. రాధాకిషన్ రావు సహా 9మందిపై 386, 365, 341, 120బి రెడ్ విత్ 34, సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.