CARS THIEF ARRESTED: చెడు వ్యసనాలు అతనిని కటకటాల పాలు చేశాయి. తన వ్యసనాలను అదుపు చేసుకోలేక డబ్బులు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తనని నమ్మిన వారిని మోసం చేయడమే కాకుండా చివరికి దొంగతనాలకు సైతం పాల్పడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రిమాండ్‌కి తరలించారు.
ఇదీ జరిగింది: చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఓనర్లకు తెలియకుండా వారి కార్లను తాకట్టు పెట్టడం వంటి పనులు సైతం చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ తెలిపారు.
డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, పలమనేరు పట్టణానికి చెందిన సుబ్బన్న జోయల్ (24) ట్రావెలింగ్ ఏజెంట్‌గా పని చేస్తూ కార్ ఓనర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఓనర్లకు నెలకు కొంత డబ్బులు ఇస్తూ, వారి వాహనాలను అద్దెకి పంపేవాడు. అయితే చెడు వ్యసనాలకు బానిస అయి ఓనర్లకు తెలియకుండా వారి కార్లను తాకట్టు పెట్టడం వంటి పనులు చేయడమే కాకుండా అతని వద్ద ఉన్న స్పేర్ కీలతో పలు కార్లను సైతం దొంగిలించి అమ్మకాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పలమనేరు పోలీసులు, సుబ్బన్న జోయల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద ఉన్న 11 కార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన కార్ల విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పలమనేరు పోలీసులను డిఎస్పీ ప్రభాకర్ అభినందించారు.
"ఇతను ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ పెట్టుకుని దానిమీద ఆధారపడి బతికేవాడు. తన వాహనాలను మాత్రమే కాకుండా మరికొన్ని కార్లను బాడుగలకు తీసుకుని వారికి నెలనెలా కట్టేవాడు. కొన్ని రోజుల తరువాత చెడు వ్యసనాలకు, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్, తాగడానికి అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం కొన్ని వాహనాలను తీసుకుని పోయి కుదవ పెట్టాడు. మరికొన్ని వాహనాలను దొంగతనం చేశాడు. ఆ విధంగా ఆరు వాహనాలను దొంగతనం చేశాడు. 5 వాహనాలను కుదవ పెట్టాడు". - ప్రభాకర్, డీఎస్పీ
డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్ - బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షలు మాయం
భారీగా జింక చర్మాలు స్వాధీనం - కర్ణాటకకు తరలిస్తుండగా పట్టివేత