Car Washed Away in Flood Water : రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కారుతో సహా వాగులో కొట్టుకుపోయిన ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వేలేరుపాడు మండలంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తున్న కారు వేలేరుపాడు వద్ద వాగులో చిక్కుకోపోయింది. వరద ఉద్ధృతిలో అలానే కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు ఉన్నారని స్థానికులు తెలిపారు.
కారులో డ్రైవర్ రామారావుతో పాటు 50 ఏళ్ల వయస్సున్న జ్యోతి, 30 ఏళ్ల గడ్డం సాయికుమారి, 11 ఏళ్ల గడ్డం కుందన కుమార్, 8సంవత్సరాల వయస్సున్న గడ్డం జగదీష్ కుమార్ ఉన్నారు. ఐదుగురు కారు నుంచి బయటకు వచ్చి వాగులో ఉన్న చెట్ల పొదల్లో చిక్కుకున్నారు. వీరిలో ఓ బాలుడు వాగులోని పొదల నుంచి సురక్షితంగా బయటకు వచ్చాడు. స్థానికులు బాలుడిని చేరదీశారు. మిగతా నలుగురు రక్షించమని హాహాకారాలు చేశారు. వాగు భారీగా పొంగుతుండటంతో కొద్దిసేపు సహాయ చర్యలకు ఆటంకం కలిగింది.
అల్పపీడన ద్రోణి ప్రభావం - కురుస్తున్న వర్షాలు - Heavy Rains in Andhra Pradesh
ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు : మొదట వాగులో చిక్కుకున్న ఐదుగురిలో పొదల నుంచి సురక్షితంగా ఓ బాలుడు బయటకు వచ్చాడు. మిగతా నలుగురినీ రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మిగతా నలుగురిని రక్షించేందుకు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే లోపే స్థానికులు, పోలీసులు తాళ్ల సహాయంతో వాగులో చిక్కుకున్న నలుగురి వద్దకు చేరుకున్నారు. బాధితులను సురక్షితంగా గ్రామస్థులు, పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు.
చంద్రబాబు ఆదేశాలు : ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టిపెట్టి అధికారులకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సహయక చర్యలు ముమ్మరం చేసేలా అధికారులకు సూచనలు చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక - రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు - Heavy Rain Alert in AP
రుతుపవనాల జోరు- రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు - RAIN ALERT