Capital Womens Visit to Kanaka Durga Temple: రాజధాని రైతులు, మహిళలు తమ మాటను నిలబెట్టుకున్నారు. అమరావతి నిలిస్తే చంద్రబాబు గెలిస్తే ఇంద్రకీలాద్రికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని శపథం చేసిన రాజధాని మహిళలు ఎట్టకేలకు మొక్కు చెల్లించుకున్నారు. రాజధాని గ్రామాల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన మహిళలు, రైతులు కనకదుర్గమ్మకు చీర, సారె, పొంగళ్లు సమర్పించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీకి ప్రజలు తగని బుద్ధి చెప్పారని కూటమి ప్రభుత్వంలో రాజధానితో పాటు రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజధాని పనులు ప్రారంభంతో మొక్కులు తీర్చుకుంటున్న రైతులు - Capital Women Paying Dues
రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలదే కీలక పాత్ర. ముందుండి రాజధాని ఉద్యమాన్ని నడిపింది వాళ్లే. అప్పట్లో కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుందామని బయలుదేరితే పోలీసులు పాశవికంగా దాడి చేశారు. ఓ పక్క ముళ్లకంచెలు, పోలీసు ఆంక్షలు, లాఠీఛార్జితో రెచ్చిపోయారు. అయినా వెరవకుండా పోరాటం సాగించారు. కాల పరీక్షకు నిలిచి చివరికి ధర్మమే గెలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్లీ రాజధాని అమరావతి కళకళలాడుతోంది. రాజధాని ప్రాంతంలో మళ్లీ పనులు మొదలయ్యాయి. దీంతో అమరావతి మహిళలు, రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
అమ్మ దయ ఉంది కాబట్టే ప్రస్తుతం రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయి. వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయాలతో తమపై పోలీసుల లాఠీఛార్జీలతో దమనకాండ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో దుర్గమ్మ సన్నిధికి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. - రాజధాని మహిళలు
అడ్డంకులన్నీ తొలగిపోవడంతో అమరావతికి మళ్లీ కొత్త కళ రావడంతో ఇన్నాళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. రైతులు, మహిళలు కాలినడకనే బయలుదేరి కనకదుర్గమ్మకు ఉత్సాహంగా మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, మందడం, వెలగపూడి, అనంతవరం, నేలపాడు తదితర రాజధాని గ్రామాల నుంచి రైతులు, మహిళలు ఎరుపు చీర, మెడలో ఆకుపచ్చ కండువాలు ధరించి దీక్షాపరులై పాదయాత్రలో పాల్గొన్నారు.
కనకదుర్గమ్మకు రాజధాని రైతుల మొక్కులు- తుళ్లూరు నుంచి పాదయాత్ర - amaravati farmers padayatra
తెల్లవారుజామునే తుళ్లూరు శిబిరం నుంచి బయల్దేరిన రైతులు, మహిళలు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కాలినడకన కనకదుర్గమ్మ చెంతకు చేరి చీర, సారె, పొంగళ్లు సమర్పించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ రాజధాని వాసులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలన్న తమ ఆకాంక్షను అమ్మవారు నెరవేర్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీయే కూటమి గెలుపొందటం, మళ్లీ అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైతుల 1631 రోజుల సుదీర్ఘ దీక్షను ఇటీవల విరమించారు. అమరావతిని, రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని రాజధాని మహిళలు వేడుకున్నారు.