Amaravati Farmers Agitation at ANU: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వవిద్యాలయంలో ఉపకులపతి రాజశేఖర్ 2019లో మూడు రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహించారు. మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరించిన వీసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాజధాని రైతులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వీసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏఎన్‌యూ (Acharya Nagarjuna University) వద్దకు చేరుకున్నారు.
వీరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లు నెట్టుకుంటూ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. వైఎస్సార్సీపీకి తొత్తుగా వ్యవహరించిన వీసీ రాజశేఖర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతుల రాకను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వీసీ కార్యాలయానికి తాళం వేశారు. అయితే వీసీ కార్యాలయం వద్దే బైఠాయించి రైతులు నినాదాలు చేశారు.
వీసీ రాజశేఖర్ వచ్చి తమకు క్షమాపణ చెప్పేంత వరకు కదలబోమని తేల్చిచెప్పారు. అంతలో అక్కడికి చేరుకున్న పెదకాకాని పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. వీసీతో మాట్లాడించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో వీసీ రాజశేఖర్ కిందకు వచ్చారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఎందుకు సమావేశం నిర్వహించారని రైతులు ప్రశ్నించారు.
అప్పటి ప్రభుత్వం ఆదేశం మేరకు అలా చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సమావేశం పెట్టాలని ఏదైనా లేఖ ఇచ్చారా అని రాజధాని రైతులు అడుగగా అలాంటిదేమీ లేదని రాజశేఖర్ చెప్పారు. అయితే ఈ సమయంలో పోలీసులు సైతం వీసీకే వత్తాసు పలికారు. రైతులు గట్టిగా అడుగుతుంటే పోలీసులు వీసీని తన కార్యాలయంలోకి పంపించారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం వైఎస్సార్సీపీకి అనుకూలంగా వత్తాసు పలుకుతారంటూ పోలీసులను రైతులు ప్రశ్నించారు.
"అసలు విశ్వవిద్యాలయాలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. కానీ ఇక్కడ ఉన్న వీసీ రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టారు. వర్సిటీని ఒక రాజకీయ పార్టీ వేదికగా తయారు చేశారు. ఆనాడు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు కాబట్టి ప్రస్తుతం రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి. అమరావతి మాత్రమే రాజధాని అని ఒప్పుకోవాలని కోరుతున్నాము". - రాజధాని రైతు
"అప్పట్లో వీసీ కూడా మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. మేము అప్పుడు వస్తే మా మీద కూడా లాఠీ ఛార్జ్ చేశారు. వర్సిటీలో రాజకీయ సెమినార్లు పెట్టారు. రాజకీయ నాయకులతో మీటింగ్లు పెట్టారు. కాబట్టి ఆ రోజు చేసిన దానికి ఈ రోజు మాకు క్షమాపణ చెప్పాలి". - రాజధాని రైతు
ఏఎన్‌యూ వీసీపై విద్యార్థి సంఘాల ఆగ్రహం- నల్ల రంగు పూసి నిరసన - Student Unions on ANU VC Policies