Can Knee Pain Go Away with Medication: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ కూర్చోవటం, లేవటం, పరిగెత్తటం, గెంతటం, అటువైపు ఇటువైపు తిరగటం, బరువులు ఎత్తటం వంటి పనులెన్నో చేస్తున్నా ఏ మాత్రం తొణక్కుండా మనల్ని సజావుగా నిలబెట్టి నడిపిస్తుంటాయి కీళ్లు. అయితే.. ఎంత బలమైనవైనా వాటికీ పరిమితి లేకపోలేదు. రోజువారీ ఒత్తిళ్లను తట్టుకునే క్రమంలో ఇవి అరిగిపోవచ్చు.. దీంతో కీలు, ఎముక రాసుకుపోయి.. నొప్పి, వాపు తలెత్తొచ్చు (ఆస్టియో ఆర్థ్రయిటిస్). అయితే ఇలా వయసుతో పాటు కీళ్లు అరిగిపోవటమనేది ఒకప్పుడు వృద్ధాప్యంలోనే కనిపించేది. కానీ, ఇప్పుడిది మధ్య, చిన్న వయసుల్లోనూ విజృంభించేస్తోంది. మరి దీనికి మందులు పరిష్కారమా? అంటే.. అవును అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జి. మనోజ్ కుమార్. అయితే అది దశలను బట్టి ఉంటుందని చెబుతున్నారు.
ప్రధాన సమస్య అరగటమే: మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం కీళ్లు అరిగిపోవటమే అని డాక్టర్ మనోజ్ కుమార్ అంటున్నారు. ఇందులో నాలుగు దశలున్నాయి వివరిస్తున్నారు. ఈ దశలను ఎక్స్రే ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అవి..
1. మృదులాస్థి అప్పుడప్పుడే ఎండిపోయే దశ.
2. మృదులాస్థి ఇంకాస్త ఎండిపోయి, మోకాలి ఎముకల మధ్య సందు తగ్గే దశ.
3. మోకీళ్లు రాసుకుంటూ కిర్రుకిర్రుమని చప్పుడు చేసే దశ.
4. దొడ్దికాళ్లు వచ్చేసి మందులు కూడా పనిచేయని దశ. కీళ్లు అరగటమే కాకుండా కొందరికి ఇతర సమస్యలూ నొప్పులకు దారితీయొచ్చని చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా? ఇలా బుక్ చేసుకోండి - TTD DARSHAN TICKETS November 2024
నివారణ ఏంటి?:
మోకాళ్ల నొప్పులను సాధ్యమైనంతవరకు మందులతో తగ్గించుకోవచ్చని డాక్టర్ మనోజ్ కుమార్ అంటున్నారు. ముఖ్యంగా మొదటి మూడు దశలలో మోకాళ్ల నొప్పులను మందులు, ఇంజక్షన్లతో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వాటితోనే చాలా వరకు నొప్పి అదుపులో ఉంటుందని.. వీటిని వాపు, నొప్పి తగ్గేంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి మృదులాస్థి దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావటమనేది అసాధ్యం. కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవటం తప్పించి మరేమీ చేయలేమంటున్నారు. అలాగే మోకాళ్లకు దన్నుగా ఉండే కండరాలు.. బలోపేతం కావటానికి కాల్షియం, విటమిన్ డి మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇక మోకీళ్ల అరుగుదల నాలుగో దశలో ఉన్నవారికి.. మందులు, వ్యాయామాలతో ఫలితం కనిపించనివారికి మోకీళ్ల మార్పిడి(Healthdirect రిపోర్టు) ఒక్కటే పరిష్కారమంటున్నారు. ఇందులో దెబ్బతిన్న మోకీలును తొలగించి, దాని స్థానంలో కృత్రిమ మోకీలు పరికరాన్ని అమరుస్తారు. ఒకప్పుడు దీన్ని 60 ఏళ్లు దాటాకే చేసేవారు. ఇప్పుడు చిన్న వయసులోనూ చేస్తున్నారు. 50 ఏళ్ల వయసులో మార్పిడి చేసినా 20 ఏళ్ల వరకు కృత్రిమ కీళ్లు హాయిగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.