Burra Venkatesham Takes Charge as TGPSC Chairman : యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పని చేస్తుందని, కమిషన్‌పై పూర్తి విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తామని నూతన టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీజీపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, ఎడ్యుకేషన్‌లో ఉన్న సమయంలో 60 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రణాళిక బద్ధంగా ప్రతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలు ప్రశాంతంగా, విశ్వాసభరితంగా రాసేలా చర్యలు తీసుకుంటామని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు మూడున్నర ఏళ్ల సర్వీస్‌ను వదులుకుని టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్షలు రాయాలని, టీజీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా అంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తామని ప్రకటించారు. టీజీపీఎస్సీకి స్వయం ప్రతిపత్తి ఉందని, దీంతో ఎవరికీ భయపడకుండా పని చేస్తామని ఉద్ఘాటించారు.
తప్పులు చేస్తే ఉపేక్షించం : ఎవరూ తప్పులు చేసినా ఉపేక్షించమని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. విద్యాశాఖలో ఉండటం వల్ల ప్రశ్నల తయారీపై మంచి అవగాహన సాధించానని, పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నల్లో తప్పులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ పదవిలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తాను కూడా ప్రిపేర్ అయ్యే సమయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెక్ట్‌గా పనిచేయడంతోనే తనకు ఉద్యోగం వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
2030 ఏప్రిల్ 4 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా : టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం 2030 ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నారు. ఐఏఎస్‌కు బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ, గవర్నర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా, జేఎన్టీయూహెచ్ వీసీగా బుర్రా వెంకటేశం రిలీవ్ అయ్యారు.
టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ - ఇంతకీ ఎవరీ బుర్రా వెంకటేశం?
టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - నియామక ఫైల్‌పై గవర్నర్ సంతకం