Tilts One Side Building Demolition in Gachibowli : హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. సిద్ధిఖ్‌నగర్‌లో మంగళవారం రాత్రి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఓ భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసించే 50 మందికి పైగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, పోలీసులు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాల్లో స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. బుధవారం హైడ్రాలిక్ యంత్రం సహాయంతో కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. అయితే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో భవన నిర్మాణానికి భారీ గుంతలు తవ్వడ వల్లనే తమ భవనం పక్కకు ఒరగడానికి కారణమని ఇంటి యజమాని స్వప్న తెలిపారు.
ఈ నేపథ్యంలో సిద్ధిఖీనగర్‌లో సామర్ధ్యానికి మించి అనేక భవనాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన గుంతలను పూడ్చివేశారు. అలాగే భవనం ఒరగడానికి కారణమైన పక్క స్థలం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భవనాన్ని కూల్చడంతో ఇంట్లో సామాన్లు పోయాయని ఇంటి యజమానురాలు లబోదిబోమని ఏడ్చింది. ఇంట్లో నివసించేవారు సర్టిఫికేట్లు, విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు.
50 మంది సురక్షితం : అయితే గత మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగించడంతో ఫలితంగా మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బిల్డింగ్ ఒక్కసారిగ పక్కకు ఒరిగింది. దీంతో అందులోని దాదాపు 50 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కానీ అందులో మూడో అంతస్తులో ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి మాత్రం ప్రాణ భయంతో బిల్డింగ్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వారితో పరిహారం ఇప్పించండి : బిల్డింగ్ ఒరగడంపై యజమానురాలు స్వప్న స్పందిస్తూ పక్కన మరో బిల్డింగ్ నిర్మాణానికి గుంతలు తవ్వడం కారణంగానే తమ భవనం పక్కకు ఒరిగిందని తెలిపారు. ఈ ఇళ్లు రెండేళ్ల క్రితమే నిర్మించామని, మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందరం ఖాళీ చేసినట్లు పేర్కొన్నారు. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉంటుందనే తొలిగించేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. కూల్చివేసేందుకు అంగీకరిస్తున్నట్లు, కానీ పక్క బిల్డింగ్ యజమానితో పరిహారం ఇప్పించాలని కోరారు
గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్థుల భవనం - కొనసాగుతున్న కూల్చివేత పనులు