Budameru Leakage Works on Fast Army Was Helping : విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. నేడు పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు. వెలగలేరు వరద ఉద్ధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు కలిసి వస్తోంది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఇబ్రహీంపట్నం సమీపంలో కవులూరు వద్ద ఎడమవైపు కట్టకు పడ్డ మూడు 3 గండ్లలో మూడోది భారీగా ఉంది.
నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు. శుక్రవారం కొంత వాన తెరిపి ఇవ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగాయి. శుక్రవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు. మూడో గండి దాదాపు 100 మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు 40 మీటర్లు పూడ్చేశారు. ఇంకా 60 మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది. దీని ఎత్తు దాదాపు 10 మీటర్ల వరకు ఉంటుంది. కుడివైపు కట్టకు జి.కొండూరు వైపు పడ్డ ఏడు గండ్లను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం ల భిస్తుంది. ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
బుడమేరుకు చేరుకున్న ఆర్మీ - గండ్లు పూడ్చివేత పనులు వేగవంతం - LEAKAGE WORKS Under Indian Army
గండిని పూడ్చేందుకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఒకవైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి శ్రమిస్తున్నారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. గండ్ల వద్ద ముందుగా గడ్డర్లు, ఇనుప రాడ్లు అమర్చి వరద ప్రవాహాన్ని ఆపి తర్వాత వాటిని పూడ్చాలని నిర్ణయించారు. పోర్టుల్లో లభ్యమయ్యే పెద్దపెద్ద రాళ్లను తీసుకువచ్చారు. ఇరువైపులా గండ్లను సాధ్యమైనంత త్వరగా పూడ్చివేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. ఆయన అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
గాబియన్ బాస్కెట్లు ఉపయోగించి రెండు పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహాన్ని సైన్యం అమలు చేస్తోంది. గాబియన్ బాస్కెట్‌లు ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణంతో తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వేయనుంది. ఇలా 4 మీటర్ల ఎత్తు మేర రక్షణ కట్టను నిర్మించి దానికి దన్నుగా బయట వైపు నుంచి మట్టిని నింపనుంది. పెద్ద ఎత్తున ఈ గాబియన్ బాస్కెట్‌లు అవసరమవుతున్నందున స్థానిక వనరుల్ని ఉపయోగించి సైట్ వద్దే వీటిని తయారు చేయిస్తోంది. అంతే కాకుండా హెస్కో బాస్కెట్‌లలో ఇసుక బస్తాలను నింపి గండిని పూడ్చేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తోంది.