BRS Leaders Tribute To Dasarathi Krishnamacharya : తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారు అందించిన స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి అని కొనియాడారు.
తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు. మహోన్నతమైన దాశరథి గొప్పతనాన్ని గుర్తించి, వారి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున, తెలంగాణ సాహిత్యంలో లబ్ధప్రతిష్టులకు ప్రతి ఏటా అందించేందుకు దాశరథి కృష్ణమాచార్య అవార్డును తమ ప్రభుత్వ హయాంలో నెలకొల్పినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టిన దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని అన్నారు.
KTR Tribute To Dasarathi : పద్యాన్ని ఆయుధంగా మలిచి, పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు దాశరథి అన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తన రచనలతో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ బిడ్డల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిన మహాకవి అని కొనియాడారు. సాహితీ రంగంలో చెరగని ముద్ర వేసిన దాశరథి కథలు, నాటికలు, కవితలు, సినిమా పాటలు వంటి ఎన్నో రచనలు చేసి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా గెలుచుకున్నారని పేర్కొన్నారు. దాశరథి సేవలకు సముచిత గౌరవం ఇస్తూ సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఆయన పేరు మీద పురస్కారాన్ని అందజేయడంతో పాటు ప్రతి సంవత్సరం దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించినట్లు తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా పాటల పయోనిధికి వినమ్రపూర్వక నివాళులు అర్పించారు.
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఎలుగెత్తి చాటిన మహనీయులు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్యుల వారి శత జయంతి నేడు.
— KTR (@KTRBRS) July 22, 2024
పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజలపక్షాన పోరాడిన యోధుడు దాశరథి. తన రచనలతో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ బిడ్డల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిన మహాకవి.
సాహితీ… pic.twitter.com/CoUMHhIbVv
కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పడానికి నీతి ఆయోగ్ నివేదిక నిదర్శనం : కేటీఆర్
నా తెలంగాణ - కోటి రతనాల వీన అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదకు ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శత జయంతి సందర్భంగా వినమ్రపూర్వక నివాళి అర్పించారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు అని హరీశ్‌రావు కొనియాడారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. pic.twitter.com/NOBaQjPGx3
— Harish Rao Thanneeru (@BRSHarish) July 22, 2024
దాశరథి కృష్ణమాచార్యకు భారత రాష్ట్ర సమితి నేతలు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్‌లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి కార్యక్రమంలో మాజీ శాసనసభాపతి మధుసూదనాచారి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, నేతలు పాల్గొన్నారు. దాశరథి చిత్రపటానికి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. తెలంగాణ కోసం జీవితాంతం పరితపించి ప్రజలను చైతన్యం చేసిన మహానుభావుడు దాశరథి అన్న మాజీ శాసనసభాపతి మధుసూదనాచారి, దాశరథి స్ఫూర్తితో కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని సాఫల్యం చేసి చూపారని తెలిపారు.
సాహిత్యంతో ఉద్యమస్ఫూర్తి : ఎంతో గొప్ప సాహిత్యం, కవులు ఉన్నా గతంలో తెలంగాణలో ఏదీ లేనట్లే చిత్రీకరించారన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ భాష, కవిత్వాన్ని కూడా అవహేళన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే తెలంగాణ వైతాళికులకు గౌరవం దక్కేదా అని వారి కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు చెప్పారని అన్నారు. దాశరథి స్ఫూర్తిని తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆర్ అని, పదేళ్లలో ఆ స్ఫూర్తితోనే వ్యవసాయం, నీటి పారుదల సహా అన్ని రంగాలను అభివృద్ధి చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పదేళ్లలో తెలంగాణలో జరిగినంత అభివృద్ధి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్న వాస్తవాన్ని మేధావులు గుర్తించాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు అందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని కోరారు.
Dasharathi Award: 'దాశరథి కృష్ణమాచార్య రచనలు ఎంతో మందికి స్ఫూర్తి'