BJP Bhanu Prakash Reddy Fire on YSRCP: తిరుమల ఏడుకొండల్లో జరిగిన అవినీతి, అక్రమాలను రాబోయే రోజుల్లో భక్తుల ముందు ఉంచుతామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న తరహాలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అంశాలపై లోతుగా వివరాలు సేకరిస్తున్నామని ఆయన అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భాను ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు.
విజిలెన్స్ విభాగం తిరుమలలో విచారణ చేస్తోందని ఆయన చెప్పారు. టీటీడీ విజిలెన్స్ మీద రాష్ట్ర విజిలెన్స్ విచారణ జరగాల్సి ఉందన్నారు. టీటీడీలో ఐపీఎస్ స్థాయి అధికారితో కూడిన విజిలెన్స్ విభాగం ఈ ఐదేళ్ల కాలం ఎవరి ఆదేశాలతో మౌనం వహించిందో త్వరలోనే నిగ్గు తేలుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగంలోనే తప్పు ఉందన్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెళ్లడాన్ని భాను ప్రకాష్‌రెడ్డి ఆక్షేపించారు.
యాత్రలకే జగన్ పరిమితం: మున్ముందు ఓదార్పు యాత్రలకే జగన్ పరిమితం అవుతారే తప్ప జైత్రయాత్ర అనేది ఆయన డిక్షనరీలో ఉండబోదన్నారు. జైలులోకి వెళ్లే ముందు ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పి లోపలికి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాతీర్పును నేలకేసి కొట్టిన వ్యక్తిని చూడడానికి వెళ్లడం సరికాదని అన్నారు. అలాంటి వ్యక్తిని ముందుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈవీఎంలు పగలగొట్టడానికి ఎంతధైర్యం ఉండాలని అన్నారు. గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అవినీతిని ఎన్డీయే ప్రభుత్వం రాబోయే రోజుల్లో బయటపెడుతుందన్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించేందుకు మహాకూటమి పని చేస్తుందని చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లోనే జగన్ పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీలో ఇమడలేమని కొందరు తమతోనూ చర్చలు జరుపుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. అల్లూరి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.