Bird Flu Deaths In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్‌ప్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు తీవ్ర వేదనను మిగిల్చింది. వైరస్ బారినపడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. గంపలగూడెం మండలం అనుముల్లంకలో ఓ పౌల్ట్రీఫామ్‌లో రెండురోజుల వ్యవధిలోనే 11 వేల కోళ్లు చనిపోయాయి. మరో 4వేల కోళ్లకు వైరస్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. పశువైద్యాధికారులు పరిశీలించి చనిపోయిన కోళ్లను గుంతతీసి పూడ్చివేయించారు. ప్రభావిత ప్రాంతాలకు పది కిలోమీటర్ల పరిధిలో తాత్కాలికంగా చికెన్, గుడ్లను తినొద్దని ప్రజలకు సూచించారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చే గుడ్లను మధ్యాహ్న భోజన పథకానికి తాత్కాలికంగా వినియోగించవద్దని అధికారులు ఆదేశించారు.
''అధిక స్థాయిలో బర్డ్‌ప్లూ మరణాలు సంభవించిన ప్రాంతాలకు పది కిలోమీటర్ల పరిధిలో తాత్కాలికంగా చికెన్, గుడ్లను తినొద్దని అందరికీ తెలియజేస్తున్నాం. ఆ ప్రాంతం పరిధి దాటిన ప్రదేశాల్లో మాత్రం మాంసం, గుడ్లను విక్రయించవచ్చు. కాకపోతే ఇక్కడ పౌల్ట్రీలో ఎక్కువ కోళ్లు చనిపోవడం వలన తాత్కాలికంగా విక్రయాలు చేయకూడదు''-సాయికృష్ణ, పశువైద్యాధికారి
AP Bird Flu 2025 : రాష్ట్రంలో తూర్పు కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1 -బర్డ్ ఫ్లూ) వైరస్ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో మరణించిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపించారు. అందులో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారించారు.
దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు కిలోమీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్‌లో 10 బృందాలు, సర్వేలెన్స్ జోన్‌లో 10 బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్ల వ్యాధులపై అన్నదాతలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
వలస పక్షుల్లో వైరస్ : కొన్ని దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడ నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల వైరస్ ప్రభావం చూపింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా బయటపడేయడంతోనే కోళ్లఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని అధికశాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుందని చెబుతున్నారు.