Bhadradri Rama Sita Statue History : ఈనెల 17వ తేదీన భద్రాచలం శ్రీసీతారామస్వామి సన్నిధిలో కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయితే ఆ రోజున కల్యాణం జరుపుకునే విగ్రహాల విశిష్టత గురించి మీకు తెలుసా? దాదాపు 2వేల ఏళ్ల క్రితం నాటి నుంచి ఆ సీతారాముల విగ్రహాలు పూజలందుకుంటున్నాయట. అంతే కాదు భద్రాద్రి రామయ్య ఆలయ నిర్మాణం కంటే ముందు నుంచి ఈ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారట. ఇంకా సీతారాముల విగ్రహాల గురించి స్థానాచార్యులు స్థలసాయి, రామాయణ ప్రవచనకర్త కృష్ణమాచార్యులు ఏం చెప్పారో తెలుసుకుందామా?
Bhadradri Rama Temple Story : కంచెర్ల గోపన్న 1670 దశకంలో హసనాబాద్ (ప్రస్తుతం పాల్వంచ) పరగణాకు తహసీల్దారుగా నియమితులై భద్రాచలంలో కుటుంబంతో కలిసి ఉండేవారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాల ఆచూకీ చెప్పడంతో వాటిని పూజించేందుకు ఆలయం నిర్మించారు. మూలవిరాట్‌కు పూజలు, అందకూ వీక్షించేలా స్వామివారికి ఆరుబయట కల్యాణం చేయాలి అనుకున్నారు.
తమిళనాడు టు భద్రాచలం : తమిళనాడులోని శ్రీరంగం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని అక్కడి ఆగమశాస్త్రం ప్రకారం పూజలందుకుంటున్న సీతారామలక్ష్మణుల విగ్రహాలను చూసి వాటిని తమకివ్వాలని కోరగా శ్రీరంగం ఆలయ నిర్వాహకులు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి ఆ సీతారాముల విగ్రహాలకే భద్రాచలంలో కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రాచీన కల్యాణమూర్తులను ఔరంగజేబు హయాంలో ఆయన సైనికుడు దంసాకు కనిపించకుండా పోలవరం వద్ద గోదావరి సమీపంలో దాచి పెట్టారు. అప్పట్లో శ్రీరామనవమి వచ్చినప్పటికీ కల్యాణమూర్తులు లేకుండా మూలవిరాట్‌కు కల్యాణోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ముందుగా మూలవిరాట్‌కు ఆ తర్వాత కల్యాణమూర్తులకు శ్రీరామనవమి కల్యాణం చేస్తున్నారు.
భద్రాద్రిలో దంసా దాడి: దంసా ఆలయంపై దాడి చేస్తారనే సమాచారంతో అర్చకులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానాలయంలోని మూలవిరాట్ బయటకు కనిపించకుండా అడ్డుగా గోడ కట్టారు. గోడ బయట మూలవిరాట్ లాగా నమూనా రాతి విగ్రహాన్ని చేసి ఉంచారు. ఇదే నిజమైనదని భావించిన దంసా దీన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దెబ్బతిన్న నమూనా మూలవిరాట్ ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. దంసా వెళ్లిన తర్వాత మూలవిరాట్‌కు అర్చకులు యథాతథంగా పూజలు చేయటం ప్రారంభించారు.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాలు
రామునికి శతవర్ష ఉత్సవం : రామాలయంలో 6 రకాల మూర్తులు ఉన్నాయి. ఇందులో కల్యాణమూర్తి ప్రత్యేకమైనది. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన రామలక్ష్మణ విగ్రహాలు, ఫణిగిరి నుంచి తెచ్చిన సీతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సీతారాముల వారికే శ్రీరామనవమి రోజున కల్యాణం చేస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. వార్షికోత్సవాలన్నీ వీటికే అందటం విశేషం. వేల సంవత్సరాల వైభవాన్ని భద్రపర్చుకున్న ఈ విగ్రహాలకు ప్రతి వందేళ్లకోసారి శతవర్ష ఉత్సవం చేయాలని అర్చకులు, అధికారులు నిర్ణయించారు. 2016లో ఈ వేడుక నిర్వహించి అయిదు కిలోల బంగారంతో భద్రత కవచాన్ని అలంకరించారు. మరో కవచాన్ని త్వరలో అలంకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Sri Rama Navami Special 2024 : దంసా దాడుల అనంతరం కల్యాణమూర్తులను తీసుకొచ్చేందుకు పోలవరం వెళ్లగా రామలక్ష్మణుల విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు. అప్పట్లో వరదలకు పవిత్ర గోదావరి గర్భంలో సీతమ్మ విగ్రహం కలిసిపోయి ఉంటుందని అర్చకులు ఆవేదనకు గురయ్యారు. ఇందులో ఒక అర్చకుడికి స్వామివారు కలలో కనిపించి సూర్యాపేట జిల్లా ఫణిగిరి రామాలయంలో సీతమ్మ విగ్రహం ఉందని, ఇది శ్రీరామనవమి కల్యాణానికి సరైనదని చెప్పినట్లు నమ్ముతుంటారు.
అప్పటి అర్చకులు ఫణిగిరి వెళ్లి అక్కడి ఆలయ నిర్వాహకులకు తెలియకుండా సీతమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి భద్రాచలంలో ప్రతిష్ఠించారు. అక్కడివారు భద్రాచలం వచ్చేందుకు ప్రయత్నించినా అదే సమయంలో గోదావరి ఉప్పొంగింది. ఆ గ్రామపెద్దలకు రాముడే కలలో కనిపించి ఫణిగిరి సీతమ్మ ఉండాల్సిన చోటు భద్రాచలమేనని చెప్పటంతో వారు శాంతించారు.
భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి - హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు