Bapatla Youth Died Shooting in America : అమెరికాలో దారుణం జరిగింది. దుండగుడి కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు. ఎంఎస్ చదువుతూ ఉద్యోగం చేసేందుకు 9 నెలల క్రితం అతను అమెరికా వెళ్లాడు. ఉద్యోగం వచ్చే వరకు ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లోని గ్యాస్ స్టేషన్ పక్కనున్న ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు.
Bapatla Man Died in America : రెండు రోజుల క్రితం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి అతనిపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత నిందితుడు స్టోర్‌లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు. దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు : గోపీకృష్ణ మరణవార్త తెలియడంతో స్వస్థలం యాజలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపి మరణంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడు కోలుకొని వస్తాడని అనుకున్నామని, కానీ ఇంతలోనే మరణించాడనే వార్త వినాల్సి వచ్చిందని కన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య ప్రవళిక, ఏడాదిన్నర వయసున్న కుమారుడు రిషిత్ ఉన్నారు. తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
"ఉద్యోగం చేసే సమయంలో మా అబ్బాయిపై కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని మాకు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేశాం. మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం." - తిరుపతిరావు, గోపీకృష్ణ తాత
"గోపీకృష్ణ డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా వెళ్లి తొమ్మిది నెలలైంది. స్టోర్‌లో పనిచేస్తుండగా దుండగుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడే కుప్పుకూలిపోయిన గోపికృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - లక్ష్మణ్, గోపీకృష్ణ మేనమామ
CM Chandrababu Condolence in Bapatla Youth Death : మరోవైపు దాసరి గోపికృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
US Shooting Today : అమెరికాలో కాల్పుల కలకలం.. 18 మందిని చంపి 'నరహంతకుడు' పరార్
అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి.. నిందితుడిని పట్టిస్తే 10వేల డాలర్ల రివార్డ్!