Farmers Crop Loans In Mahbubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బ్యాంకర్లు, రైతులకు ఇవ్వాల్సిన పంటరుణాలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఏటా వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాలను నిర్దేశించుకోవడమే తప్ప, అందులో సగం కూడా రైతులకు చేరడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి కలిపి రైతులకు 13వేల 410కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇచ్చింది 6వేల865 కోట్లే. నిర్దేశించిన లక్ష్యంలో 51 శాతమే రుణాలిచ్చి బ్యాంకర్లు చేతులు దులిపేసుకున్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చామని చెబుతున్న రుణాలు కూడా రైతులు పునరుద్ధరించుకున్న రుణాలే.
గతంలో కేసీఆర్ సర్కారు లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి విడతల వారీగా డబ్బులు జమచేసింది. రుణమాఫీ అవుతుందని చాలామంది రైతులు కొత్త రుణాలు తీసుకోలేదు. మాఫీ అయ్యేందుకు ఏళ్లు గడిచింది. బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసి పాత రుణాలే మళ్లీ ఇచ్చినట్లు రెన్యువల్ చేశారు. చాలామంది రైతులు పంటరుణాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం, కేసీఆర్ హయాంలోని లక్ష లోపు రుణమాఫీ సక్రమంగా అమలు కాకపోవడంతో బ్యాంకులు రైతులకిచ్చిన రుణాల శాతం గణనీయంగా పడిపోయింది.
బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట - రూ.72,659 కోట్లు కేటాయింపు - telangana budget 2024 highlights
ఈసారి అలాంటి కొర్రీలేవీ లేకుండా రుణమాఫీ అయిన ప్రతి ఒక్కరికి తిరిగి కొత్తరుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆగస్టు 15లోపు కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తామని చెప్పిన రుణమాఫీ విషయంలోనూ రైతులు గందరగోళానికి గురవుతున్నారు. లక్షలోపు రుణమాఫీలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షా 69వేల రైతుల ఖాతాల్లో.. 947కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు మరో 2లక్షల రైతు ఖాతాల్లోకి 1200 కోట్లు జమ చేయనుంది. ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత వ్యవధిలో 2లక్షలలోపు రుణ బకాయిలు ఉన్న కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు.
ఏ ప్రాతిపదికన వారికి రుణమాఫీ అమలు కాలేదో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అర్హులై ఉంటే ఆగస్టు 15లోపు కచ్చితంగా రుణమాఫీ అవుతుందని చెప్పి పంపించి వేస్తున్నారు. రుణమాఫీ పొందిన వారికి కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. కాని కొందరు పాత బకాయిలు, వడ్డీలు చెల్లిస్తేనే, కొత్త రుణాలు ఇస్తామని కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ అమలై, అర్హులైన వారికి తక్షణం రుణాలు మంజూరు చేస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో 4 లక్షల20 వేల మంది రైతులకు 9వేల కోట్లు, యాసంగిలో 2లక్షల 81వేల రైతులకు 6వేల కోట్లు మొత్తంగా రెండు సీజన్లలో 15వేల కోట్లు పంట రుణాలుగా అందించాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2లక్షల రుణమాఫీ అమలవుతున్న నేపథ్యంలో ఈసారైనా పంటరుణ లక్ష్యాలు నెరవేరుతాయా వేచిచూడాల్సిందే.