Balineni Protest in Samathanagar Police Station: ఒంగోలు సమతానగర్‌లో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఠాణా వద్ద ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు గొడవ చేస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారా అని విరుచుకుపడ్డారు.
అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటే ఎన్నికల సంఘం మెచ్చుకుంటుందని భావించి ఇలా అక్రమ అరెస్టులు చేస్తారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని బాలినేని హెచ్చరించారు. అదేవిధంగా తెలుగుదేశం నేత దామచర్ల జనార్థన్ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఎస్పీ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ధర్నా చేస్తే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన బాలినేని ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శ్రీకావ్య సమతానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా హిమశ్రీ అపార్టుమెంట్‌లోకి వెళ్లగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త చప్పిడి ప్రభావతి శ్రీకావ్యతో వచ్చిన మహిళా వాలంటీర్‌ను గుర్తించారు. రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించిన ప్రభావతి, టీడీపీ మద్దతుదారుపై జెండా కర్రలతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన తెలుగుదేశం నాయకుడిపైనా మూకుమ్మడిగా విరుచుకుపడి హత్యాయత్నం చేశారు.
రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నిస్తూ ఫొటో తీసేందుకు కొందరు యత్నించారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో శ్రీకావ్య వెంట ఉన్న వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జెండా కర్రలతో ప్రభావతి, ఆమె కుటుంబీకులను తీవ్రంగా కొట్టారు. వైసీపీ నేతల చేతిలో దాడికి గురైన ప్రభావతి ఫిర్యాదులో బాలినేని కోడలు శ్రీకావ్య, గోలి తిరుపతిరావు, అట్ల కల్యాణ్‌రెడ్డి గంటా రామానాయుడు, సాయి సహా 31 మంది వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఒంగోలులో రెచ్చిపోయిన వైసీపీ - టీడీపీ కార్యకర్త కుటుంబంపై మూక దాడి - అడ్డుకున్న నాయకుడిపైనా!