Baby Girl Sale in Guntur : పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి గంపెడు ఆశలతో ఎదురుచూసింది. కడుపులో చిన్నారి హాయిగా ఆడుకుంటుంటే ఎంతో సంబురపడింది. పసిపాప రూపాన్ని కళ్ల ముందు తల్చుకుంటూ రోజూ మురిసిపోయింది. ప్రసవవేదనను భరించి ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ తక్కువ బరువు ఉండటంతో మృతి చెందింది. దీంతో తీవ్రంగా కలత చెందింది. ఎలాగైనా అమ్మ అనిపించుకోవాలని ఆరాటపడింది. ఇందుకోసం ఆ మాతృమూర్తి వేరొకరి ద్వారా ఓ ఆడశిశువును కొనుగోలు చేసింది.
ఆమె కొనుగోలు చేసిన చిన్నారిది మరోక వ్యథ. అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ పాపది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. దీంతో తండ్రే ఆ పసిపాపను అంగట్లో బొమ్మలా అమ్మకానికి పెట్టాడు. కానీ ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోవడంతో ఈ గుట్టు కాస్తా రట్టైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Guntur GGH Child Sale Case : ఓ ఆడశిశువును విక్రయించిన కేసు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆ పసికందు మృతి చెందింది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జయంతి గమనించారు. దీంతో ఆమెకు అనుమానం కలిగింది. వెంటనే జయంతి ఉన్నతాధికారుల ద్వారా ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన లక్ష్మి అనే మహిళ చీరాలలో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. రెండు వారాల క్రితం ఆమెను వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. ఈ విషయాన్ని మీరాబి స్నేహితురాలు ప్రభావతి తెలుసుకుంది. వెంటనే చిన్నగంజాంకు వెళ్లి మృతురాలి భర్త సుబ్రమణ్యంకు రూ.1.90 లక్షలు చెల్లించి ఆ పసిపాపను కొనుగోలు చేసి మీరాబికి అప్పగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ చిన్నారిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రానికి తరలించారు.