Baby Expression Monitoring Technology Available in Hospitals : అప్పుడే పుట్టిన శిశువు ముఖకవళికలు, స్పందన (హావభావాలు) చూసిన తల్లితండ్రులు ఎంతో మురిసిపోతారు. పసికూన ఏడ్చినా, నవ్వినా, చిన్నినోరు తెరిచి ఆవలించినా కూడా తెగ సంబరపడిపోతారు. అదే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే, బిడ్డ ముఖంలో భావాలెలా మారుతున్నాయో చూడగలిగితే, ఈ ఆనందాలను కోరుకునే వారి కోసమే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.
శిశువు కడుపులో ఉన్నప్పుడే సేకరించిన చిత్రాలను పెద్దయ్యాక కానుకగా ఇవ్వడం నయా ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 5 డైమన్షనల్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో తల్లిదండ్రులకు ఈ అనుభూతి దొరుకుతోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5డీ బేబీ ఎక్స్‌ప్రెషన్ మానిటరింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
తల్లి కడుపులో శిశువు 36 వారాలుంటే, 26వ వారం నుంచి కదలికలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. చిరునవ్వు, ఆవలింత, నాలుక, కళ్లు, చేతులు, కాళ్ల కదలికలు ఇలా హావభావాలన్నీ గర్భస్థ దశ నుంచే ప్రారంభమవుతాయి. 5డీ అల్ట్రాసౌండ్ సాయంతో వీటిని చాలామంది చిన్నారుల హావభావాలను ఒడిసి పట్టి జ్ఞాపకాలుగా భద్రపరుస్తున్నారు.
వంటింట్లోనే ప్రసవం- పండంటి మగబిడ్డకు ఆయువు- తలుపు తెరిచి చూస్తే!
ఇతర ప్రయోజనాలూ ఎన్నో: 5డీ స్కానింగ్‌తో శిశువు శారీరక, మానసిక మార్పులనూ గుర్తించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. శిశువును 5 కోణాల్లో పరిశీలించిన తర్వాత సమస్యలేవైనా ఉంటే సరిదిద్దే వీలుందో లేదో తెలుసుకుని చికిత్స అందించవచ్చు. ఇందులో ఉన్న ఏఐ సాంకేతికత శిశువు శరీర పెరుగుదలను కచ్చితంగా అంచనా వేస్తుంది.
స్కాన్ సమయాన్ని తగ్గించి వైద్యులకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికతను ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణకు వినియోగించబోమని నిర్వాహకులు చెబుతున్నారు. శిశువు వీడియోలు, ఫొటోలు రికార్డు చేసే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.