Attack on Proddatur SI in Police Station : శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు అండగా నిలుస్తున్న పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. స్టేషన్కు వెళ్లి మరీ వారిపై దాడులతో రెచ్చిపోతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రూరల్ స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ రఫీపై దాడి కలకలం రేపుతోంది. మఫ్టీలో ఉండగా స్టేషన్లోనే ఆయనపై రాజుపాళేనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ ఫిర్యాదు మేరకు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్ జిల్లా రాజుపాళెంకు చెందిన చిన్న లింగమయ్య, ప్రొద్దుటూరుకు చెందిన హర్ష అనే ఇద్దరు యువకులు బైక్పై చిన్నశెట్టిపల్లె రోడ్డు నుంచి ప్రొద్దుటూరు పట్టణంలోకి వేళ్లేందుకు బైపాస్ రోడ్డు దాటుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి కడపకు వెళ్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. దీంతో అటువైపు వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ గుర్తించి వెంటనే పోలీస్ జీపులోనే క్షతగాత్రులను ప్రొద్దుటూరులోని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం కారు డ్రైవర్ కడపలోని కొండాయపల్లెకు చెందిన వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని గ్రామీణ ఠాణా వద్దకు వెళ్లారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాల ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి పంపిస్తారు. ఆ ప్రకారమే ప్రొద్దుటూరులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ వెంకటరెడ్డికి నోటీలు అందించి పంపించారు.
తమాషాలు చేస్తున్నారా? - పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి నోటీసు ఇచ్చి పంపిస్తారా? అంటూ గాయపడిన చిన్న లింగమయ్య బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి నేరుగా స్టేషన్ వద్దకు వెళ్లి రెచ్చిపోయారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో ఠాణా సిబ్బంది అప్పటికే ఇంటికి వెళ్లిన పోయిన ఎస్ఐ మహమ్మద్ రఫీకి సమాచారం ఇచ్చారు. ఎస్ఐ వెంటనే మఫ్టీలో స్టేషన్కు చేరుకున్నారు. చిన్న లింగమయ్య అన్న లింగమయ్య ఎస్ఐపై దాడికి తెగబడ్డాడు. సిబ్బంది అప్రమత్తమై దాడిని అడ్డుకున్నారు. లింగమయ్యతో పాటు శివ, ప్రవీణ్, రాము, మేరి, శాంతి మరికొందరు తన విధులకు ఆటకం కలిగించి దాడి చేశారని రెండో పట్టణ ఠాణాలో ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై డీఎస్పీ భక్తవత్సలం గ్రామీణ ఠాణాకు చేరుకుని ఆరా తీశారు. ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సెల్యూట్ టు ఏపీ పోలీస్ - 'చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లిన సీఐ'