Assembly House Committee inquiry on Visakha Dairy : విశాఖ డెయిరీలో అవకతవకలపై ఏర్పాటైన అసెంబ్లీ సభా సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. సభా సంఘం ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గౌతు శిరీష, ఆర్ వి ఎస్ కె కె రంగారావు, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమామహేశ్వరరావు ఈ ఉదయం విశాఖ చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి అందరూ విశాఖ డెయిరీ చేరుకున్నారు. అధికారులతో కలిసి విశాఖ డెయిరీని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు ముడు గంటలు డైయిరీ పై సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా అధికారులతో సభ సంఘం సమీక్ష నిర్వహించింది.
విశాఖ డెయిరీ పరిశీలించిన అనంతరం సభా సంఘం చైర్మన్ జ్యోతులు నెహ్రూ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఆదేశాలతోనే విశాఖ డెయిరీ పరిశీలించామన్నారు. పరిశీలన తరవాత మా సందేహాలు మరింత పెరిగాయన్నారు. వీటి మీద ఒక నిపుణుల కమిటీ వేయాలని తెలిపారు. అలాగే విశాఖ డెయిరీ మీద ఆడిట్ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమ పరిశీలన సమయంలో విశాఖ డెయిరీ చైర్మన్ హాజరు కాలేదని, కేవలం ఎండీ మాత్రమే పాల్గొన్నారని వెల్లడించారు. విశాఖ డెయిరీ నాలుగు జిల్లాలో పరిధిలో ఉంది కనుక నాలుగు జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. పాడి రైతులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
పాడి రైతులు నష్టపోకుండా చూస్తాం: జ్యోతుల నెహ్రూ
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్పీకర్ ఆదేశాలతో విశాఖ డెయిరీ పై హౌస్ కమిటీ వేశారన్నారు. ఇప్పటిదాక విశాఖ డైరీ మీద అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయని, కానీ ఇక్కడకు వచ్చాక ఆ సందేహాలు మరింత పెరిగాయని వెల్లడించారు. పాడి రైతులను అడిగితే డబ్బులు తగ్గించారని చెబుతున్నారు, యాజమాన్యం మాత్రం అదేమీ లేదని చెప్తోందని తెలిపారు. విశాఖ డైరీ ని కమిటీ మరో సారి పరిశీలిస్తుందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ డెయిరీ ముందు నిరసన చేస్తున్న కార్మికులను సభా సంఘం సభ్యులు పలకరించారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. విశాఖ డైయిరీ సమస్యలు కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇద్దరూ రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
విశాఖ డెయిరీలో ఆడారి కుటుంబం అక్రమాలు - లోకేశ్‌కు మూర్తియాదవ్ ఫిర్యాదు