Gorintaku Festival Celebration 2024 in Telangana : ఆషాఢ మాసం అమ్మవారికి ప్రత్యేకం. వర్షాలు కురిసే ఈ సమయంలో అమ్మవార్లకు బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు సందడిగా సాగుతాయి. ఇక ఇదే మాసంలో ఆడపడుచులు ఒక్క చోట చేరి ఎంతో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు.
Health Benefits Of Gorintaku : ఎర్రగా పండిన తమ చేతులను చూసి మురిసిపోతారు. ప్రకృతి హితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చేతులు, పాదాలకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి, వాతం తగ్గుతాయని పెద్దలు చెబుతారు. అందుకే మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు.
వరంగల్లో ఘనంగా గోరింటాకు సంబారాలు : ఆషాఢ మాసం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలోనూ, పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్ధానంలోనూ ఈ వేడుకలు నిర్వహించారు. 150మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాటలు పాడి సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు.
"భానుడి తాపం నుంచి తేరుకున్న తరవాత ఆ వేడికి స్త్రీ శరీరం భరించలేని స్థితిలో ఉంటుంది. ఆ వేడి నుంచి తేరుకోవడానికి స్త్రీలు గోరింటాకును చేతులకు పెట్టుకుంటారు. అందరం ఇక్కడకు చేరి గోరింటాకును ముద్దగా చేసి చేతులకు అలంకరించుకున్నాం. ఇది వరకటి రోజుల్లో గోరింటాకు అందరిళ్లలో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అందువల్లనే అందరం ఒకేచోటికి చేరి ఈ విధంగా చేస్తున్నాం. నీటి మార్పుద్వారా రకరకాల జబ్బులు ఏవైతే వస్తాయో వాటన్నింటిని నివారించడానికి ఈ విధంగా గోరింటాకును అలంకరించుకోవడం అనాదిగా వస్తుంది. గత ఆరేళ్లుగా ప్రతీ ఏటా ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం" - పాల్గొన్న మహిళలు
ప్రతి ఆషాఢ మాసంలో : ప్రతి ఆషాఢ మాసంలోనూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటామని గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని భావి తరాలకు తెలియచేయాలని మహిళలు కోరారు. వరంగల్‌లోని వాసవీ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్వంలోనూ ఇటీవల గోరింటాకు సంబరాలు సందడిగా సాగాయి. దాదాపు 200 మంది వనితలు సంబరాల్లో పాల్గొన్నారు. గోరింటాకు పెట్టుకుని ఉల్లాసంగా గడిపారు.