Archery Champion Bairagi Naidu From Paderu: చిన్నతనం నుంచి విలు విద్యపై ఎంతో మక్కువ. కాని కంటి ముందు అన్ని ఆర్థిక కష్టాలే. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. అసలే మారుమూల గిరిజన ప్రాంతం. క్రీడ నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్లాలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేసి విలు విద్యలో జాతీయ స్థాయిలో రాణించే స్థాయికి చేరాడు ఈ గిరిజన పుత్రుడు.
కంటి చూపు లక్ష్యం పైనే ఉంచుతూ గురి పట్టి బాణాన్ని వదులుతున్న ఈ యువకుడి పేరు బైరాగినాయుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డ. చిన్నతనం నుంచి కడు పేదరికాన్ని ఎదుర్కొన్న ఈ యువకుడు తల్లి ప్రోత్సాహంతో విలు విద్యలో ముందుకుసాగాడు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి, మరోవైపు విలువిద్యలో పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నాడు.
క్రీడల్లో రాణిస్తోన్న నెల్లూరు యువత- చదువులో సత్తాచాటుతూ ఆటల్లో పతకాలపంట
సాధారణంగా విలు విద్య క్రీడ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా మెరుగైన పరికరాలు లేకపోయినా ఉన్న వాటితోనే సరిపెట్టుకుంటూ విద్య నేర్చుకున్నాడు ఈ యువకుడు. కఠోర శ్రమ చేసి 2015లో 35వ జాతీయ క్రీడల్లో మొదటిసారి, 2023లో రెండవసారి బంగారు పతకాలు సాధించి అందరికి ఆదర్శమయ్యాడు. మన్యంలో పుట్టి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని రెపరెపలాడించిన ఘనత బైరాగినాయుడికి దక్కింది.
విలువిద్యపై ఉన్న ఆసక్తితో రోజుకు ఐదారు గంటల పాటు శ్రమించేవాడు బైరాగినాయుడు. ఏ క్రీడలు ఆడాలన్నా ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం. గిరిజన ప్రాంతంలో విలువిద్య అనేది వారి రక్తంలోనే ఉంటుంది. కానీ వారికి తగ్గ ప్రోత్సాహం అందనంత ఎత్తులో ఉంటుంది. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి సత్తా చాటిన ఈ యువకుడు ఆ తర్వాత అంతర్జాతీయంగా ముందుకు వెళ్లలేదు. ప్రధాన కారణం లక్షల్లో ధర ఉన్న విల్లు కొనలేకనే. ప్రభుత్వ సహకారం లభిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని దృఢ సంకల్పంతో చెప్తున్నాడు.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు
2015లో జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన బైరాగి నాయుడు మరింత రాటు దేలడానికి అడపా సుధాకర్ నాయుడు రూపంలో మరొక కోచ్ సహకారం అందింది. అల్లూరి ఆర్చరీ అకాడమీ పేరుతో ప్రారంభించి బైరాగి నాయుడికి మరింత కఠోర శిక్షణ ఇవ్వడంతో 37వ జాతీయ క్రీడల్లో బంగారు పతకం వచ్చింది. ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో ఉద్యోగం సాధించడంతో తన శిక్షణకు అడ్డంకులు ఏర్పడినా ఆటకు పదును పెట్టాడు.
గంటలు తరబడి శిక్షణ తీసుకుంటూ, సెలవు రోజులు కూడా వినియోగించుకుని గట్టి సాధన ప్రయత్నం చేసేవాడు బైరాగినాయుడు. కుటుంబ సభ్యులందరి సహకారంతో విలువిద్య పోటీలో సత్తా చాటాడని తన చిన్ననాటి మిత్రులు చెప్తున్నారు. ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో టీచర్‌గా పనిచేస్తూ విలువిద్య క్రీడ వదల్లేదని కొనియాడుతున్నారు.
అధికారులు చొరవ చూపి దగ్గర ప్రాంతంలో డిప్యూటేషన్ రూపంలో పంపించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని చెప్తున్నాడు ఈ క్రీడాకారుడు. ప్రభుత్వాలు ఈ క్రీడపరంగా అవగాహన పెంచి సౌకర్యాలు కల‌్పించాలని కోరుతున్నాడు.