Anakapalli ArcelorMittal Plant : ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ (ఏంఎ/ఎన్‌ఎస్) కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీలు ప్లాంట్(ఐఎస్‌పీ)కు సంబంధించి మొదటి దశలో పెట్టే రూ.70,000ల కోట్ల పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భారీ పెట్టుబడులను అమరావతి నుంచి కాకుండా అదే ప్రాంతం నుంచి ప్రకటించడం వల్ల ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు తెలిసింది. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఈరోజు చంద్రబాబు విశాఖ చేరుకుని అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశం ఉందని తెలిసింది.
జనవరిలో శంకుస్థాపన : ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి వచ్చే సంవత్సరం జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. పరిశ్రమకు అవసరమైన భూముల కేటాయింపు విషయంపై సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి దగ్గర బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కోసం కేటాయించిన 2,000ల ఎకరాల్లో కొంతభాగంతోపాటు విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములను ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సుమారు 5,000ల ఎకరాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఐఎస్‌పీ మొదటి దశ పూర్తైతే సుమారు 20,000ల మందికి ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా భారీగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రానికి ఆర్సెలార్ రావడం వెనుక సుదీర్ఘ కసరత్తు : పొరుగు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్ సంస్థ దాదాపు నిర్ణయం తీసుకుంది. అక్కడి సర్కార్‌తో సంప్రదింపుల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ దశలో సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టింది. సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో నేరుగా సమావేశమయ్యేలా చూసేందుకు పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీ అధికారులతో కూడిన బృందం కీలకంగా వ్యవహరించింది. ప్రోత్సాహకాలపై సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సర్కార్ చర్చించింది. నెల రోజుల వ్యవధిలోనే సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నేరుగా సమావేశమయ్యారు. రెండురోజులకోసారి సంస్థతో అధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రతిపాదించిన భూములను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్ సంస్థ అంగీకరించినట్లు తెలిసింది.
కియా వచ్చిన తరహాలో : కియా కార్ల తయారీ పరిశ్రమను ఏపీకి తెచ్చేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ సర్కార్ ఏ విధంగా కృషి చేసిందో ఇప్పుడూ అదే తరహాలో ఆర్సెలార్ ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి వచ్చేలా చేసేందుకు కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అప్పట్లో కియా కూడా మహారాష్ట్రలో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. ఆ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి రావడం వెనుక కీలకంగా నిలిచారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు కసరత్తు చేశారు.
ఉత్తరాంధ్రకు మరో మణిహారం - అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్!
"పెట్టుబడులు, ప్రోత్సాహకాలు" - రాష్ట్రం రూపురేఖలు మార్చనున్న "ఆరు పాలసీలు"