Arakuloya Attracts Tourists with its Natural Beauty in Alluri District : అరకులోయ ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పాల కడలిని తలపిస్తున్న మంచు సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. పాడేరు చుట్టు పక్కల పచ్చని కొండల మధ్య తేలియాడే మేఘాలు భూమిని తాగుతున్న అందాలు కట్టిపడేస్తున్నాయి.
పాడేరులో పాలసముద్రం : మరో వైపు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ పాల సముద్రంలా కనువిందు చేస్తుంది. కొండపై దట్టంగా కమ్మిన పొగమంచు పర్యాటకుల మదిని దోచుకుంటుంది. సూర్యుడి రాకను స్వాగతిస్తూ దూదిపింజల్లాంటి మేఘాలు పక్కకు తొలగుతూ ఉంటున్నట్లు ఉన్నాయి. సూర్యుడు తొలి వెలుగుకు పచ్చని కొండలు కనువిందు చేశాయి. దీంతో పాడేరు సమీప ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం 9 గంటలు అయిన మంచు తెరలు వీడటం లేదు. మినుములూరు కాఫీ బోర్డులో ఉదయం 15 డిగ్రీలు, పాడేరులో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అరకు లోయ టు లంబసింగి - ఆకాశం నుంచే అందాల వీక్షణ
Para Gliding in Araku Valley: ఆంధ్రా ఊటీగా పిలుచుకునే అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఎ అధికారులు సాహసోపేతమైన పారా గ్లైడింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందమైన కొండల నడుమ గ్లైడింగ్ చేస్తూ పర్యాటకులు కొత్త అనుభూతిని పొందేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు.
పారా గ్లైడింగ్తో కొత్త అనుభూతి : ఇందులో భాగంగానే పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ కొద్దిసేపు పారా గ్లైడింగ్ చేసి కొత్త అనుభూతిని పొందారు. పరాగ్ లైటింగ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా పాడేరు ఐటీడీఎ ఆధ్వర్యంలో చేపడితేనే బాగుంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీని ఆదాయంతో పాటు పర్యాటకులకు ఒక కొత్త అనుభూతి కలిగిస్తుందని వారు అంటున్నారు. దీని వలన ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని వారు నమ్ముతున్నారు. గతంలో కంటే టూరిస్టుల తాకిడి మరింత పెరిగి రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే వనరుగా ఉంటుందని అంటున్నారు.