APPSC Group-2 Mains Exam Postponed : వచ్చే ఏడాది జనవరి 5 న తలపెట్టిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. గ్రూప్ -2 ఉద్యోగానికి సిద్దమయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సన్నద్దమయ్యేందుకు మూడు నెలల పాటు సమయం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23 న మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. నిరుద్యోగుల అభిప్రాయాలకే ఏపీపీఎస్సీ పెద్దపీట వేయడం పై నిరుద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.
పరీక్ష తేదీని మార్చాలని విజ్ఞప్తి : వచ్చే ఏడాది జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ మార్చుకుంది. నిరుద్యోగుల విజ్ఞప్తి దృష్ట్యా వారికి అనుకూలంగా ఉండేలా పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన అనురాధ పెండింగ్‌లో ఉన్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై చర్చించి, జనవరి 5న నిర్వహంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబర్ 30న ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ పరీక్షలకు అడ్డు రాకుండా అప్పట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా పరీక్ష తేదీ నిర్ణయించిన సమయం నుంచి పరీక్ష నిర్వహించే తేదీ వరకు కనీసం 90 రోజుల పాటు గడువు ఉండాల్సి ఉండగా కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో గ్రూప్-2 మెయిన్స్‌కు సిద్దమయ్యే అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. సిలబస్‌లో మార్పులు చేయడం వల్ల తక్కువ సమయంలో ప్రిపేర్ కాలేమని మెయిన్స్ పరీక్ష తేదీని మార్చాలని ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ అనురాధను కలసి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు సైతం ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధను కలసి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను మరో 30 రోజులు వాయిదా వేసి నిర్వహించాలని కోరారు. పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు సైతం ఇదే విధంగా విజ్ఞప్తి చేశాయి. మార్చిన సిలబస్ ప్రకారం సన్నద్దమయ్యేందుకు గడువు పెంచాలని కోరారు.
కూటమి ప్రభుత్వ పెద్దలు సైతం నిరుద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో నిర్ణయాన్ని మరో సారి సమీక్షించిన ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ అభ్యర్థుల డిమాండ్‌కు అనుగుణంగా పరీక్షను మరికొద్ది రోజుల అనంతరం నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. గ్రూప్-2 రాసే అభ్యర్థులు చాలా మంది డీఎస్సీ రాసేందుకు సిద్దమవుతున్నారు. ఇలాంటి వారు రెండు పరీక్షలకూ హాజరయ్యేలా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పరీక్షల తేదీకి అడ్డు రాకుండా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ను ఫిబ్రవరి 23న నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆగమేఘాలపై నియామక ప్రక్రియ : ప్రభుత్వ కొలువు సాధించాలన్న లక్షల మంది నిరుద్యోగుల జీవిత కలను గత వైఎస్సార్సీపీ సర్కారు నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన జగన్ కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడంతో గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా 897 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. సిలబస్‌లో మార్పులు చేసి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్-2కు 4లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరయ్యారు. వారిలో 92వేల 250మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.
'గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయండి' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ పరిశీలన
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా - తిరిగి పరీక్ష ఎప్పుడో తెలుసా? - APPSC Group 2 Mains Exam Postponed