Rythu Bima Application till August 5th : రాష్ట్రంలో రైతు బీమా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. భూములు క్రయ, విక్రయాలు, ఇతరత్రా రూపాల్లో చేతులు మారిన భూములు సంబంధించి జూన్ 28వ తేదీ వరకు పట్టాదారు పాసు పుసక్తం వచ్చిన రైతులు ఇంత వరకు కూడా రైతు బీమా చేసుకోకపోయిన అర్హులు తక్షణమే బీమా చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రకటించింది.
ఆగస్టు 5వ తేదీలోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన రైతులు దరఖాస్తు సమర్పించాలని సూచించింది. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బీమా పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో గ్రామాల్లో రైతు బీమా పథకం కింద దరఖాస్తున్న రైతులు బీమాలో ఏమైనా మార్పులు, చేర్పులు లేదా ఆధార్‌లో నామిని చనిపోతే మార్పులు కోసం మాత్రం జులై 30వ తేదీగా తుది గడువుగా స్పష్టం చేసింది.
రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం : అలాగే, కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన రైతులు మాత్రమే చేయాల్సిన దరఖాస్తు కోసం అవసరమైన దరఖాస్తు ఫారంతోపాటు రైతు పట్టాదారు పాసుపుసక్తం లేదా తహసీల్దార్‌తో డిజిటల్ సంతకం, డీఎస్ పేపరు జత చేయాలి. రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డు, నామిని మైనర్ అయితే అపాయింటి విధిగా మేజర్ అయి ఉండి తీరాలి. వీరిద్దరివీ ఆధార్ కార్డ్ జిరాక్సులు సంబంధిత క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారుల సమక్షంలో దరఖాస్తుపై సంతకం చేసి సమర్పించాలి.
మార్గదర్శకాలు సంబంధించి 1965 ఆగస్టు 14 నుంచి 2006 ఆగస్టు వరకు మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమా పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆధార్ కార్డ్‌లో 18 నుంచి 59 సంవత్సరాలు వయస్సు గల రైతులు మాత్రమే ఈ బీమా పథకం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ వర్గాలు సూచించాయి.
Rythu Bima Application Form Attached Files : దరఖాస్తు ఫారంలో పొందుపరిచిన అంశాలు స్పష్టంగా అర్థమయ్యేలా నింపేసి రైతు బీమా దరఖాస్తు, భూమి పాస్ బుక్, ఆధార్ కార్డు, నామిని ఆధార్ జిరాక్స్ పత్రాలు వంటివి జత చేసి స్వయంగా రైతు వేదికల్లో ఏఈఓలకు సమర్పించాలని పేర్కొంది.
ఈ రైతు బీమా పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతు ఏ కారణం చేతనైనా కూడా మరణించినట్లైతే బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందుతున్న విషయం విదితమే. మరోవైపు, ఏమైనా సందేహాలు ఉంటే రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని కలిసి నివృత్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.