AP People Top in Debts : ఏపీ అక్షర క్రమంలోనే కాదు అప్పుల్లోనూ అగ్రస్థానంలోనే ఉంది. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన జనాభాలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మందిపై అప్పుల భారం ఉన్నట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే (Comprehensive Annual Modular Survey)లో తేలింది. అప్పులు తీసుకున్న వారిలో పట్టణవాసుల కంటే గ్రామీణులే 4.30% ఎక్కువగా ఉన్నారు. పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళల్లో అప్పులు ఉన్నవారు 32.86%, పురుషుల్లో 1.56% అధికంగా ఉన్నారు. అప్పులు ఉన్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య 21.69% అధికంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలు 7.49% అధికంగా ఉన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా అప్పుల్లో మహిళల సంఖ్య పురుషులను మించి లేదు.
దక్షిణాదిలోని వారిపైనే రుణ భారం అధికం : జాతీయ సగటు లక్షమందిలో 18,322గా ఉంటే రాష్ట్రంలో అందుకు మూడు రెట్లు ఎక్కువ. 2022 జులై నుంచి 2023 జూన్ మధ్య ఈ సర్వే నిర్వహించే నాటికి రూ.500కి మించి రుణం తీసుకొని, చెల్లించని వారందరినీ రుణ గ్రహీతల కింద పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో పోలిస్తే దక్షిణాదిలోని వారిపైనే రుణ భారం అధికంగా ఉన్నట్లు తేలింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్దేశ్‌లో ప్రతి లక్ష మందిలో 11,844 మందిపైనే అప్పులు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి వారి సంఖ్య 20వేలకు మించలేదు.