AP NDA Leaders Meeting: అయిదేళ్ల పాలనలో జగన్ 8 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ, జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని పట్టాభి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమన్నారు. యువగళం, ప్రజాగళం, జనవాణిలు, కూటమి విడుదల చేసిన వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన లక్షా 30 వేల వినతుల ఆకాంక్షల్లో నుంచి మేనిఫెస్టోను రూపొందించామన్నారు. బాబు ష్యూరిటీకి మోదీ గ్యారెంటీ తోడుగా ఉందని పట్టాభి స్పష్టం చేశారు.
కూటమి మేనిఫోస్టోకు కేంద్ర సహకారం పూర్తిగా ఉందని గుర్తుచేశారు. కూటమి మేనిఫెస్టోలో ప్రాంతీయ సమత్యులత ఉందని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డి తొత్తులతో కలిసి తయారు చేసిన మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆక్షేపించారు. చిత్తుకాగితంగా జనం దాన్ని చెత్త బుట్టలో వేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, జగన్ మానసిక స్థితి దిగజారిపోయిందన్నారు.
యువతను నట్టేట ముంచారని, రైతులను దగా చేశారని, ఉద్యోగులను హింసించారని, జగన్ రెడ్డిని జనాలు నమ్మడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అందరూ ఆదరించి పాలాభిషేకాలు చేస్తున్నారని పట్టాభి తెలిపారు. చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉంటుందని ఉద్ఘాటించారు. కూటమి పాలనలో రివర్స్ పీఆర్సీలు ఉండవని, వాలంటీర్ల జీతాలు పెంచి ఆదుకోవడం జరుగుతుందన్నారు.
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి పేదలను ఆదుకుంటామని, ఉచిత ఇసుక ఇస్తామని పట్టాభి తెలిపారు. ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, మత సామరస్యంతో పనిచేసి అందరికీ మేలు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ డిక్లరేషన్‌తో పంచాయతీలను అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ను నివారించి మాఫియాను అరికడతామని తేల్చిచెప్పారు.
LANKA DINAKAR ON TDP JSP MANIFESTO: బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను, టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బీజేపీ జాతీయ శక్తి అని, టీడీపీ-జనసేన ప్రాంతీయ శక్తి అని తెలిపారు. రెండు శక్తుల కలయిక దేశ, రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అని పేర్కొన్నారు. మోదీ గ్యారెంటీ, బాబు ష్యూరిటీ, పవన్ పాపులారిటీ, ఎన్డీయే విక్టరీ అని లంకా దినకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రా తమ స్ఫూర్తి అని తెలిపిన లంకా దినకర్, దేశం, రాష్ట్రం రెండు కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
14 అంశాలతో మోదీ గ్యారెంటీ 2024 సంకల్ప్ పత్రం విడుదల చేశారని, టీడీపీ-జనసేన మేనిఫెస్టోకు బీజేపీ నేతలు హాజరయ్యారని అన్నారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్ ముఠా సిద్ధహస్తులు అని లంకా దినకర్ మండిపడ్డారు. శ్మశానంలో శిలాఫలకాలపై కూడా జగన్ బొమ్మలు వేసుకోవాలనే మానసిక స్థితికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోపై బొమ్మలు గురించి కూడా రాజకీయాలు చేస్తున్నారని, ప్రజా సంపద దోచుకోవడమే పనిగా పెట్టుకున్నవారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.