AP HC on Illegal Hoardings : ఏపీలో అనధికార హోర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించటంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ డాక్టర్ ఎ. ఈశ్వర్‌రెడ్డి 2018లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై బుధవారం నాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్ల విషయంలో న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
పట్టణాల్లోని రాజకీయ నేతల అందరి దర్శనం ప్రతీరోజు ప్రజలకు అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు రహదారులకు ఇరువైపులా, విద్యుత్ స్తంభాలకు ఇష్టానుసారంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి అసౌకర్యాలకు గురి చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల వల్ల నగర పాలక సంస్థలకు, పురపాలక సంఘాలు ఆదాయం కోల్పోతున్నాయని న్యాయస్థానం పేర్కొంది.
HC Inquiry on Hoarding and Flexi Issue PIL : ప్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించేందుకు ఏమి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చెప్పాలని వాదనల విషయంలో కోర్టుకు సహాయకులుగా నియమితులైన అమికస్ క్యూరీ వివేక్ చంద్రశేఖర్‌ను హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్ ప్రణాళికను తమ ముందు ఉంచాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
'ఆ ప్లెక్సీలు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే' - HC on Unauthorised Hoardings