AP High Court on Srisailam Maha Kumbhabhishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వారంలో ముహూర్తం ఖరారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వివరాలను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు తర్వాత కూడా ముహూర్తం పెట్టేందుకు ఏడు నెలల సమయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు ఎవరిని సంప్రదించారు? ఎప్పుడు సంప్రదించారు? ఎంత మంది నుంచి సలహాలు తీసుకున్నారు? వారు ఏఏ తేదీలు సూచించారు? తదితర వివరాలు చెప్పాలని కమిషనర్‌కు ప్రశ్నలు సంధించింది. కమిషనర్ నుంచి నేరుగా వివరాలను రాబట్టింది. ఇప్పటికే కొంత మంది పీఠాధిపతులు, ప్రముఖులను సంప్రదించామని, మరికొందరిని కలిసి రెండు రోజుల్లో ముహూర్తం నిర్ణయిస్తామని కమిషనర్ బదులిచ్చారు. దీంతో వారంలో ముహూర్తం నిర్ణయించాలని తేల్చిచెప్పింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్ గత సంవత్సరం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. గత సంవత్సరం మేలో హైకోర్టు విచారణ జరిపింది.
High Court on Maha Kumbhabhishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం వాయిదాపై హైకోర్టు ప్రశ్నలు
త్వరగా సంప్రదింపులు జరిపి ముహూర్తం తిరిగి ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆరు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది. కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ వ్యవహరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి హాజరుకు ఆదేశించింది. ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ కమిషనర్, ఐఏఎస్ ఎస్ సత్యనారాయణ హైకోర్టుకు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు.
ఎవరిని, ఎప్పుడెప్పుడు సంప్రదించారని ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కంచికామకోటి పీఠం విజయేంద్ర సరస్వతి స్వామీజీ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, శ్రీశైలం పీఠాధిపతి డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివచార్య మహాస్వామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగశర్మను సంప్రదించినట్లు తెలిపారు.
మార్చి 12 నుంచి 30 వరకు వివిధ తేదీలను సూచించారని పేర్కొన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీశైలం దేవస్థానం ప్రధాన పూజారులు, మరికొందరిని సంప్రదిస్తామని, రెండు రోజుల్లో ముహూర్తం తేదీలను నిర్ణయిస్తామన్నారు. కుంభాభిషేకం మొత్తం ఐదు రోజుల కార్యక్రమం అని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, వారంలో ముహూర్తం నిర్ణయించి ఆ వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.
High Court on Srisailam : కుంభాభిషేకం ముహూర్తాన్ని త్వరగా ఖరారు చేయాలి.... హైకోర్టు ఆదేశం