AP High Court On Ramana Dikshitulu TTD Case Issue: టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులపై నమోదు చేసిన కేసు విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
టీటీడీ అధికారులు, ఆలయంపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అయింది. దీనికి ప్రతిగా ఉద్యోగులు, అర్చకులు మీడియా సమావేశాలు పెట్టి రమణదీక్షితులపై విమర్శలు చేశారు. తరువాత దీనిపై రమణ దీక్షితులు స్పందించారు. వీడియోలో ఉన్నది తన గొంతు కాదని, తనను ముద్దాయిలా చూస్తే తానేమీ చేయలేనని పేర్కొన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు
సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీశాఖకు చెందిన మురళీ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణదీక్షితులపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసి విచారణ నిమిత్తం హాజరుకావాలని కోరారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమణదీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది శీతిరాజు శ్యాంసుందర్‌రావు వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పిటిషనర్‌కు 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, 41ఏ నోటీసు నిబంధనను పాటించాలని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేస్తే దానిని సవాలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చారు. అనంతరం పిటిషన్‌పై విచారణను మూసివేశారు.
Ramana Dikshitulu: ఆ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి రమణ దీక్షితులు