AP High Court on MP Raghu Ramakrishna Raju Petition: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy), ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిల్ విచారణార్హతపై ఈ నెల 15న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.
తాము వేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా పిటిషనర్ వేసిన కౌంటర్ ఆదివారం రాత్రి తమకు అందజేశారని, దానిని చదివేందుకు కొంత సమయం కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది వివేక్‌చంద్రశేఖర్ కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
సీఎం జగన్, ఆయన ఆప్తులకు లబ్ది జరిగేలా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పాలసీలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ హైకోర్టులో పిల్ వేశారు. ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రతివాదులు వేసిన ప్రాథమిక కౌంటర్లుకు తాము రిప్లై కౌంటర్లు వేశామన్నారు. వాదనలు చెప్పేందుకు సిద్ధమన్నారు. జగన్ తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ సమయం కోరడంతో విచారణ ఈనెల 15కి వాయిదా పడింది.
ఎంపీ రఘురామ పిల్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు - ప్రతివాదులకు ఈ మెయిల్, వ్యక్తిగతంగా నోటీసులు
సీఎం జగన్ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌కు ఎంపీ రఘురామ రిప్లై కౌంటర్ హైకోర్టులో దాఖలు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యక్తిగతంగా ప్రయోజనం పొందింది జగన్‌మోహన్‌రెడ్డి కాబట్టి వ్యాజ్యంలో ఆయన ప్రతివాదిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కీలక విధాన నిర్ణయాలన్నీ ఆయనవేనన్నారు. తనను ప్రతివాదిగా తొలగించాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరించాలన్నారు.
రాజకీయ కారణాలతో పిల్ దాఖలు చేసినట్లు జగన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సదుద్దేశంతో దాఖలు చేశానన్నారు. లోక్‌సభ సభ్యత్వానికి తనను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ తమ రాజకీయ పార్టీ 2020 జులైలో లోక్‌సభ స్పీకర్‌ను కోరినమాట వాస్తవమేకాని ఇప్పటి వరకు తనను అనర్హుడిగా ప్రకటించలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనను శత్రువుగా చూస్తున్నారు తప్ప అతనిని తాను ఎప్పుడు శత్రువుగా చూడలేదన్నారు. వైసీపీ ఎంపీగా మంచి పాలసీలను శ్లాఘించానన్నారు. చెడు విధానాలను విమర్శిస్తున్నానన్నారు.
ఈ క్రమంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని పలుమార్లు జగన్‌కు సలహా ఇచ్చానన్నారు. చెప్పింది విననప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతిని తెలియజేశానన్నారు. రామాయణంలో విభీషణ, మహాభారతంలో విధుర పాత్ర పోషించానన్నారు. అసమ్మతి తెలియజేయడాన్ని శత్రుత్వంగా భావించడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన అధికరణ 19(1) ప్రకారం చర్చాకార్యక్రమాలు, పత్రిక సమావేశాల్లో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నానన్నారు. జగన్ ఆరోపించినట్లు ఆయనపై ద్వేషం లేదన్నారు.
వైసీపీ నాలుగున్నరేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్
జగన్ బెయిలు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో తాను పిటిషన్ వేసింది నిజమేనన్నారు. 11 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులలో నిందితుడిగా ఉన్న జగన్ ప్రస్తుతం బెయిలుపై ఉన్నారని, ఆయా కేసులలో విచారణకు హాజరుకావడం లేదన్నారు. ఈ కేసులలో నిందితులుగా ఉన్న వారికి ప్రభుత్వ పాలనలో భాగస్వాములను చేసి కీలక పదవులు కట్టబెట్టారన్నారు. ఇలాంటి చర్య సాక్షులను ప్రభావితం చేయడమే అవుతుందన్నారు. విచారణకు సహకరించి కేసులు త్వరగా పరిష్కారం అయి జగన్ క్లీన్‌చిట్‌తో బయటకు రావాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ కేసులలో జగన్ నిరపరాధిగా బయటపడితే తమ రాజకీయ పార్టీ(వైసీపీ) ఆశాచిహ్నం ప్రకాశవంతం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే బెయిలు రద్దు కోసం సదుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశానన్నారు. వాస్తవాలను దాచి పిల్ దాఖలు చేయలేదన్నారు. ప్రస్తుత పిల్ విచారణ నిమిత్తం అవసరమైన తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించానన్నారు. పెడింగ్ కేసుల వివరాలన్నింటిని ప్రస్తావించాల్సిన అవసరం పిల్ రూల్స్ ప్రకారం లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తాను దాఖలు చేసిన పిల్‌పై జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తపరిచిన అభ్యంతరాలను తోసిపుచ్చాలని పిటిషనర్ కోరారు.
విజన్ ఉన్న నాయకుడ్ని వదిలేసి సోది చెప్పే వారిని ఎన్నుకున్నాం: ఎంపీ రఘురామ