High Court Hearing PeddiReddy Petition : మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కల్పించిన 5+5 పోలీసు భద్రతను ప్రస్తుతం కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు : రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ మంత్రి హోదాలో 5+5 సెక్యూర్టీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి చట్ట నిబంధనలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నారన్నారు. మంత్రి హోదాను దృష్టిలో పెట్టుకొని గతంలో 5+5 భద్రత కల్పించారు తప్ప, ప్రాణహాని ఉందన్న కారణంతో కాదన్నారు. ప్రాణహాని ఉందని నిరూపించేందుకు పిటిషనర్ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదన్నారు. ప్రాణహాని ఉందని భావిస్తే నోడల్ అథార్టీ/ఎస్పీని సంప్రదించాల్సి ఉంటుదన్నారు. పిటిషనర్ ఎస్పీకి దరఖాస్తు సమర్పించారన్నారు.
'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security
అదనపు భద్రత అవసరం లేదని ఎస్పీ తేల్చారన్నారు. భద్రత కల్పన విషయంలో సెక్యూర్టీ రివ్యూ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామన్నారు. భద్రత కల్పించే విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, రాజ్యాంగబద్ధ పదవులు అలంకరించిన వారికి, తదితరులకు ఏ విధమైన భద్రత కల్పించాలో పేర్కొంటూ 1997 మార్చిలో మార్గదర్శకాలతో కూడిన జీవో 655ని జారీచేశారని గుర్తు చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి విచారణను జులై 8కి వాయిదా వేశారు.
గుడిసేవ నరసింహారావు వాదనలు : పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. మంత్రిగా ఉన్నప్పుడు 5+5 భద్రత ఉండేదని, ప్రస్తుతం 2+2 సెక్యూర్టీని సైతం ఇవ్వడం లేదన్నారు. గతంలో ఉన్న భద్రతను ఎందుకు ఉపసంహరించారో పోలీసు అధికారులు కారణం చెప్పడం లేదన్నారు. నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉపసంహరించారన్నారు. ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితులున్నాయన్నారు.
న్యాయమూర్తి స్పందిస్తూ మంత్రి హోదా పోయాక ఆటోమేటిక్‌గా గతంలో కల్పించిన భద్రత పోతుందని ఏజీ చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సెక్యూర్టీ రివ్యూ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఏజీ చెబుతున్న నేపథ్యంలో విచారణను జులై 8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించారు.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యాజ్యం : మరోవైపు తనకు 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దాఖలు చేసిన మరో వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. కౌంటర్ వేసేందుకు ఏజీ సమయం కోరడంతో జూన్ 8కి వాయిదా పడింది.