AP HC Rejects YSRCP Bail Petitions : వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను నిరాకరించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ వారికి బెయిల్‌ను నిరాకరించింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేంతవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలన్న వైఎస్సార్సీపీ నాయకులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాలు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి వారికి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది.
Mangalagiri TDP Office Attack Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీస్‌పై పట్టపగలే వందలాది మంది దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీటితో వైఎఎస్సార్సీపీ నేతలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కానీ ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో అప్పటి పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.