Helicopters For Jagan Tour: ఎన్నికలు సమీపిస్తుండంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ సిద్ధం చేస్తోంది. రెండూ ముఖ్యమంత్రి జగన్ వినియోగించుకునేలా ఒకటి విజయవాడ, రెండోది విశాఖపట్నం విమానాశ్రయాల్లో వాటిని మొహరిస్తూ ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ నిర్ణయించింది. రెండు ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లను లీజు ప్రాతిపదికన తీసుకునేలా గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ లిమిటెడ్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో హెలికాప్టర్ కు రూ.1.91 కోట్లతో పాటు అదనంగా ఎయిర్ పోర్టు హ్యాండ్లింగ్, పైలట్లు, సిబ్బంది, ఇంధన రవాణా వ్యయాలను కూడా ప్రభుత్వమే భరించనుంది.
ప్రభుత్వం ఉత్తర్వులు: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ సిఫార్సుతో వీటిని లీజు ప్రాతిపదికన తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఇంజన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లను రెండింటిని తీసుకోవాలని నిర్ణయించారు. విజయవాడ విమానాశ్రయంలో ఒకటి, విశాఖలో మరొకటి మొహరించాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ నిర్ణయించింది. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ పర్యటనలతో పాటు వీవీఐపీల ప్రయాణం కోసం వేర్వేరుగా రెండు హెలికాప్టర్లను తీసుకోవాలని ఏవియేషన్ కార్పొరేషన్ సిఫార్సుల్లో పేర్కొంది.
నెలకు రూ.1.91 కోట్లు: హెలికాప్టర్ల లీజు కోసం టెండర్లు పిలిచినా ఇతర సంస్థలు సిద్ధంగా లేకపోవటంతో గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ ఎల్ 1గా నిలిచినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్ల రూపాయల చొప్పున లీజు చెల్లించాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. హెలికాప్టర్ లీజు మొత్తంతో పాటు ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటళ్లలో బస, రవాణా, ఇంధన రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు, గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీల చెల్లింపులకు నిర్ణయించారు. రెండు ఇంజన్లు కలిగిన భెల్ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ సంస్థ ముందుకు వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది.
సీఎం సభతో ప్రజలకు తప్పని తిప్పలు - జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
విజయవాడ, విశాఖ విమానాశ్రయాల్లో: ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని, సీఎం ప్రయాణాలకు అనువుగా లేదని ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం ముఖ్యమంత్రి తో పాటు వీవీఐపీల ప్రయాణం కోసమంటూ రెండు హెలికాప్టర్లను లీజు ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం రెండు హెలికాప్టర్లను ముఖ్యమంత్రి ప్రయాణాలకే వినియోగించేలా ఒకటి విజయవాడ, విశాఖ విమానాశ్రయాల్లో మోహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హెలికాప్టర్లను తీసుకునేందుకు గానూ ముఖ్యమంత్రి జగన్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యాధునిక రెండు బెల్ హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జగన్ పర్యటనతో ప్రజల ఇక్కట్లు- రహదారి మధ్యలో బారికేడ్లు ఏర్పాటు