AP Capital Amaravati : 'ఏపీ ఏకైక రాజధాని అమరావతే. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్నే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని దృఢ నిశ్చయానికి వచ్చాం. ఈ నేపథ్యంలో మాస్టర్‌ప్లాన్ (Masterplan), భూసమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం' అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజధాని నిర్మాణం, అమరావతి ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్‌బుల్ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడు సంవత్సరాలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.
16 పేజీల అఫిడవిట్ : రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వెల్లడించింది. అందువల్ల న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం న్యాయస్థానం ముందు ఉన్న ఎస్‌ఎల్‌పీపై విచారణ ముగించాలని ప్రభుత్వం కోరింది. రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్( Neerabh Kumar Prasad) పేరుతో ఏపీ ప్రభుత్వం 16 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
"అమరావతి రాజధాని"లో ఆ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటు - ఫిక్స్ చేసిన CRDA
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మాస్టర్ ప్లాన్, భూసమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి రాజధానిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దానిలో కీలకాంశాలివీ..
2014 డిసెంబర్ 30న గెజిట్ : రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చట్టాన్ని చేసి ఏపీసీఆర్‌డీఏ (APCRDA)ని ఏర్పాటు చేసింది. గవర్నర్ ఆమోదముద్రతో ఆ చట్టాన్ని 2014 డిసెంబర్ 30న గెజిట్‌లో ప్రచురించింది.
గుంటూరు, విజయవాడ మధ్య కృష్ణా నది పొడవునా 24 రెవెన్యూ గ్రామాల వ్యాప్తంగా 53,748 ఎకరాల విస్తీర్ణాన్ని రాజధాని నగర ప్రాంతంగా గుర్తించి 2014 డిసెంబర్ 30న జీఓ ఎంఎస్ నం.254ను విడుదల చేసింది. చట్టంలోని సెక్షన్ 3(3)ప్రకారం మొత్తం 122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ప్రకటించింది. ఆ తర్వాత 2015 జూన్ 9న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.141లో రాజధాని ప్రాంతాన్ని 122 చ.కి.మీ.కి బదులుగా 217 చ.కి.మీలుగా సవరించింది. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌ను చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం 2016 ఫిబ్రవరి 23న ప్రచురించింది. ఆ మాస్టర్ ప్లాన్‌లో ఏపీ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అందులో
1. రాష్ట్ర రాజధాని అమరావతిని కేవలం ప్రభుత్వ పరిపాలనా నగరంగానే కాకుండా ఆర్థిక హబ్ (Financial Hub)గా తీర్చిదిద్దుతామని చెప్పింది.
2. అమరావతిలో ఒక్కో దాంట్లో లక్ష నుంచి 1.5 లక్షల మంది నివసం ఉండేలా27 టౌన్‌షిప్‌లు (ఒక్కోటి 1000 ఎకరాల్లో) అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొంది. ప్రతి టౌన్‌షిప్‌ను 250 ఎకరాల చొప్పున నాలుగు భాగాలుగా విభజించి అక్కడ నివాస ప్రాంతాలకు నడిచి వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ మాల్ ఉండేలా చూస్తామని పెర్కోంది.
అమరావతి పునర్నిర్మాణానికి ప్రభుత్వం మిషన్ మోడ్ - 15 నుంచి పనులు ప్రారంభం
- నదీ ముఖంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (Central Business District) ఏర్పాటు చేసి, అక్కడ అన్ని ముఖ్యమైన కార్పొరేట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.
- 3,200 కి.మీ. పొడవున ఉన్న రహదారుల్లో నడక దారులు, సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
- అన్ని యుటిలిటీ మౌలిక వసతులనూ భూగర్భం ద్వారా అందిస్తామని చెప్పింది.
- మాస్టర్ ప్లాన్ ప్రకారం రాష్ట్ర అమరావతి తొమ్మిది నగరాల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇందులో 2091 హెక్టార్లలో ఆర్థిక నగరం, 1,093 హెక్టార్లలో ప్రభుత్వ నగరం, 1,339 హెక్టార్లలో న్యాయ నగరం, 3,459 హెక్టార్లలో విజ్ఞాన నగరం, 1,679 హెక్టార్లలో క్రీడా నగరం, 2,647 హెక్టార్లలో ఆరోగ్య నగరం, 2,663 హెక్టార్లలో ఎలక్ట్రానిక్ నగరంతోపాటు మీడియా, పర్యాటక నగరాలను నిర్మించాలని వెల్లడించారు.
- 2050 వరకు ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. నగరం సమగ్ర అభివృద్ధి కోసం తొమ్మిది ఆర్థిక నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయడానికి సీఆర్‌డీఏ (APCRDA)కి ఒకేచోట ఉండే విస్తృత స్థాయి భూమి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ విధానం కింద భూములు సేకరించింది. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్ (Land Pooling Rules) 2015ని కూడా రూపొందించింది. ఈ నిబంధనలు 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
- ఈ భూసమీకరణ నిబంధనల ప్రకారం రాజధాని కోసం భూములు అప్పగించిన అన్నదాతలకు ప్రతిఫలంగా నివాస, వాణిజ్య అవసరాల కోసం ప్లాట్లు తిరిగి ఇవ్వడంతో పాటు, ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అందులో మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి. భూ యజమానులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన భూమి ఏపీసీఆర్‌డీఏ (APCRDA) చేతుల్లో ఉంటుంది. ఆ భూమిలో నవ నగరాల నిర్మాణం జరుగుతుంది. తద్వారా పెట్టుబడులు తెచ్చి ఉపాధి, సామాజిక మౌలిక వసతుల కల్పన చేయాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఆర్‌డీఏ ఈ భూమిని వివిధ సంస్థలు, కంపెనీలకు కేటాయించనుంది.
- భూసమీకరణ కింద భూమి సేకరించిన తర్వాత యజమానులకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. తాత్కాలిక అవసరాల కోసం ఏపీ హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా నిర్మించింది. తుది భవనాల నిర్మాణం పూర్తి అయిన తరువాత ఈ భవనాలను ఇతర అవసరాల కోసం వాడుకుంటుంది. ఏపీ హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కోసం తుది భవనాల నిర్మాణం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర అధికారుల నివాస భవనాల నిర్మాణం 2018-19లోనే ప్రారంభం అయ్యాయి.
- 2019 సంవత్సరం మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పూర్తిగా వదిలి వేసింది.
- ఆ తరువాత ఏపీ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020, ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ చట్టం 2020 చేసింది.
- ఆ రెండు చట్టాలు, మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయని రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా నష్టపోయిన బాధితులు 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వ చర్యలు తమ ప్రాథమిక హక్కులు భంగం కలిగించేలా ఉన్నాయని అందులో తెలిపారు. ఆ బ్యాచ్ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ చట్టాలను చేసింది. అయితే సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ చట్టాలకు అతీతంగా బాధిత రైతులు వివిధ అంశాలను రిట్ పిటిషన్లలో ప్రస్తావించడంతో ఏపీ హైకోర్టు వాటిపై విచారించి 2022 మార్చి 3న తుది తీర్పు వెలువరించింది. రిట్ పిటిషన్ 13203/ 2020, ఇతర బ్యాచ్ పిటిషన్లను అనుమతించింది. అందులో ఏపీ ప్రభుత్వానికి 7 షరతులు పెట్టింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ఈ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.
- ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం, భూసమీకరణ కింద భూములు ఇచ్చిన అన్నదాతలకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని వారికి ఒప్పందం ప్రకారం చేయాల్సిన, చట్ట బద్ధమైన వాగ్దానాలను నెరవేర్చాలని, 2022 మార్చి 3న రిట్ పిటిషన్ నెం.13203/2020లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ యాక్ట్-2014లోని నిబంధనల ప్రకారం, ఫామ్ 9.14లో చెప్పిన ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ ఆటార్నీ కం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లో చెప్పిన స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ నిబంధనల ప్రకారం సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.
- పైన పేర్కొన్న డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్రానికి అమరావతిలోనే ఏకైక రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. భూసమీకరణ పథకం, భాగస్వాములతో చేసుకున్న ఒప్పందం, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వానికి చెందిన 3 ప్రధానాంగాలకు చెందిన కార్యాలయాలన్నింటినీ 2016 ఫిబ్రవరి 26న నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒకే రాజధాని నగరంలో నిర్మిస్తుంది. ఆ మాస్టర్ ప్లాన్‌లో కేవలం తొమ్మిది నగరాలే కాకుండా మిగిలిన ముఖ్యమైన అభివృద్ధి ప్రణాళికలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏపీ హైకోర్టు తన తీర్పులో ఇచ్చిన కాలపరిమితుల గడువు ముగిసిపోయినందున ప్రస్తుతం కొత్త కాలపరిమితులను న్యాయస్థానం ముందు ఉంచుతున్నాం. దీని ప్రకారం అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక వసతులు, తాగు నీరు, రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ లాంటి సౌకర్యాలను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం.
- అమరాతి రాజధాని, రాజధాని ప్రాంత నిర్మాణం పూర్తి, అభివృద్ధి చేసిన ప్లాట్లను అన్నదాతలకు తిరిగి అప్పగింతను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. భూసమీకరణ పథకంలోని మిగిలిన కోణాలతోపాటు, ఏపీ ల్యాండ్ పూలింగ్ స్కీంలోని షెడ్యూల్-2 కింద ఉన్న ఎల్‌పీఎస్ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాన్నీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం.
- 2016 సంవత్సరం ఫిబ్రవరి 23న ప్రకటించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధి నవ నగరాల ఇతివృత్తంతో దశల వారీగా 2050 వరకు సాగుతుంది. భవిష్యత్తులో ఎదురు అయ్యే అవసరాలు, అవకాశాలపై ఆధారపడి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుంది' రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం న్యాయస్థానం ముందు ఉన్న ఎస్‌ఎల్‌పీపై విచారణ ముగించాలని కోరింది.