Aadhaar Card For Talliki Vandanam Scheme 2024 : ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకు సిద్ధమైంది. పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం', 'స్టూడెంట్ కిట్' అనే సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుందని, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.
పరిగణనలోకి 10 రకాల పత్రాలు : రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు 'తల్లికి వందనం', 'స్టూడెంట్ కిట్' ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
'తల్లికి వందనం' పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు, బ్యాగ్, బెల్టు, మూడు జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇవ్వనున్నారు. ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్‌ను కలిగి ఉండాలి.
ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్ వచ్చే వరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, ఉపాధి పథకం కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా డ్రైవింగ్ లైసెన్సు, తపాలా పాస్‌బుక్ వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women