Pawan Kalyan Takes Complaints From People: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అధికారులతో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తునే ప్రజల నుంచి నేరుగా వినతుల్ని స్వీకరిస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలలోని ఒప్పంద ఉపాధ్యాయులు గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలలో సుమారు 1000 కిపైగా ఉపాధ్యాయులు నెలకు 12 వేల వేతనంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అందక, చాలీ చాలనీ జీతంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీలో ఈ పోస్టులను కలిపేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నామని, ఇప్పుడు డీఎస్సీ ప్రకటనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి కనీసం వేతనం అమలు చేయాలని, లేకపోతే సీఆర్టీలగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్, ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని కలుసుకున్న పవన్ కల్యాణ్ వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్ క్రాఫ్టు , సంగీత ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపట్టాలని ఏపీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరింది. మరోవైపు ప్రమాదవశాత్తూ ఇళ్లు కాలిపోవటం వల్ల తన కుమార్తె సర్టిఫికెట్లతో పాటు చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. వారి నుంచి వినతుల్ని స్వీకరించిన పవన్ కల్యాణ్ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జల్‌జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review