CM Chandrababu Signs Five Special Files : ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో 5 కీలకమైన హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉద్యోగుల ఘనస్వాగతం, హర్షాతిరేకాల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు మొదటి బ్లాక్‌లోని తన కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సరిగ్గా 4 గంటల 41 నిమిషాలకు 5 అంశాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్దిదారులతో చంద్రబాబు మాట్లాడారు.
మెగా డీఎస్సీపై తొలి సంతకం : మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొత్తం 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. 6 వేల 731 ఎస్జీటీ పోస్టులు, 132 పీఈటీ పోస్టులు, 7 వేల 725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 17 వందల 81 టీజీటీ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా తొలి సంతకం చేశారు.
పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారు- సీఎం చంద్రబాబుకు రైతుల ఘనస్వాగతం - Farmers Grand Welcome to CBN
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం : వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం కారణంగా భూవివాదాలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉండటంతో దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దానిపై సంతకం చేశారు.
పింఛన్ల పెంపుపై సీఎం చంద్రబాబు మూడో సంతకం : సామాజిక పింఛన్లను 4 వేల రూపాయలకు పెంచుతూ ఇచ్చిన హామీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో సంతకాన్ని చేశారు. ఏప్రిల్ నుంచి సామాజిక పింఛన్ల పెంపు అమలు చేసేందుకు వీలుగా దస్త్రంపై సంతకం పెట్టారు. ప్రస్తుతం ఇస్తున్న 3 వేల రూపాయల పింఛన్‌ను 4 వేలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల 69 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు ఈ పింఛన్ల పెంపు వర్తించనుంది. దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛన్ అందిచనున్నారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై నాలుగో సంతకం : రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే దస్త్రంపై సీఎం చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించేలా ఏర్పాటు చేసిన క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు ఆ దస్త్రంపై సంతకం చేశారు. దీనిపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
నైపుణ్య గణనకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు ఐదో సంతకం : రాష్ట్రంలో వివిద కళాశాలలు, పాలిటెక్నిక్ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాల అంచనా లెక్కించేలా నైపుణ్య గణనకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు ఐదో సంతకం చేశారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతలో ఆనందం వ్యక్తమవుతోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను నియమిస్తూ ఆదేశాలు : ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు పెట్టిన వెంటనే హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్పీ ద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను డిసెంబర్ 31 నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కిల్ సెన్స్-2024ను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా యువతలోని నైపుణ్యం ఏ మేరకు ఉందన్న వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. వివిధ వర్గాల్లోని యువతకు ఉన్న నైపుణ్యం ఏ మమేరకు నైపుణ్యం అవసరమనే అంశాలపై దృష్టిపెట్టాలని సూచించింది. నైపుణ్య గణనకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సస్‌కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - తొలిరోజే ఆ ఐదు సంతకాలు పూర్తి - CM Chandrababu Naidu