AP CEO Mukesh Mumar Meena Orders to SPs: రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన రాజకీయ హత్యలు, హింసాత్మకం ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలోని ఈసీ కార్యాలయానికి రావాలని మూడు జిల్లాల ఎస్పీలను ఎన్నికల ప్రధానాధికారి (Chief Electoral Officer) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈసీ కార్యాలయానికి వచ్చి హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డిలకు ఆదేశాలు జారీచేశారు. ఆళ్లగడ్డ, గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో టీడీపీ నాయకుడి కారు తగలబెట్టిన ఘటనలపై ఈసీ వివరణ కోరింది. ఘటనకు గల కారణాలు హింసకాండ వెనుక గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రం 4 గంటలకు రావాలి: గత మూడు రోజుల్లో గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు జరిగాయని, మాచర్లలో వాహనం తగలబెట్టారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు తన ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఈ మూడు హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను ఆదేశించామన్నారు. అసలు ఈ ఘటనలు ఎవరు చేశారు? ఎందుకు జరిగాయి? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు అనే అంశాలపై వారి నుంచి నివేదిక తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎస్పీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం అంశం కేంద్ర హోం శాఖ, ఎస్‌పీజీ (Special Protection Group) పరిశీలనలో ఉందన్నారు. దీనిపై పలు రాజకీయ పార్టీలిచ్చిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా
40 మంది వాలంటీర్లపై చర్యలు: ప్రభుత్వ రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధమని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత 3 రోజుల వ్యవధిలో అలాంటి 46 మందిపైన శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకున్నామని అన్నారు. వారిలో 40 మంది వాలంటీర్లే ఉన్నారన్నారు. మిగతావారు వీఆర్వోలు, ఇతర ఒప్పంద ఉద్యోగులు అని పేర్కొన్నారు. రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొన్న రెగ్యులర్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేశామని చెప్పారు.
ఒప్పంద ఉద్యోగులు, వాలంటీర్లను తొలగించామని, స్వయంగా రాజకీయ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపైన క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మరికొంతమందిపైనా ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వినియోగించొద్దని, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా తాజాగా తొలగించిన, కేసులు నమోదైన వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండొచ్చా లేదా అనే దానిపై సరైన సమయంలో నిర్ణయం చెబుతామని, అదే విధంగా సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామ, వార్డు వాలంటీర్లు ద్వారా అందించొచ్చా లేదా అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO