AP BJP Assembly Candidates List : కాషాయ దళం ఎన్నికల కదన రంగంలోకి దిగేందుకు సమాయాత్తమవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సిద్ధం చేశారు. మూడు పార్టీల పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇటీవల పురందేశ్వరి దిల్లీ వెళ్లి ఐదు రోజులు మకాం వేసి మరీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కేంద్ర పెద్దలతో చర్చించారు.
పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆదివారం రాత్రి అధికారికంగా జాబితాను విడుదల చేయగా, అసెంబ్లీ స్థానాల అభ్యర్దుల ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. నేడో, రేపో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే పది మంది బీజేపీ అభ్యర్దుల జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ చేరుకుని, పార్టీ కార్యాలయానికి వచ్చారు. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
BJP Leaders Meeting in Vijayawada: నేడు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులతో పాటు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు మొత్తం 150 మంది వరకు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థనాథ్ సింగ్ నాథ్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రధానంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాలలో ఉన్న పరిస్థితులు, అక్కడ పొత్తు పార్టీలు అయిన టీడీపీ, జనసేన నేతలతో కూడా భేటీ అయ్యాలే ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలోనే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీంలను కూడా ఎంపిక చేయనున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పని చేస్తూ టిక్కెట్లు ఆశించిన వారు, ప్రజల్లో తిరిగే నాయకులను గుర్తించి, వారికి ఆయా నియోజకవర్గాలలో ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచార కార్యక్రమాల ప్రణాళికను నిర్ణయించేలా ఈ సమావేశం కీలకంగా మారనుంది.
ఇలా నియోజకవర్గాల వారీగా అభ్యర్దులకు, నాయకులకు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేయనున్న నేపథ్యంలో ఆమె అక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత వివిధ నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
మరోవైపు బీజేపీ నిర్వహించే సభలకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్‌ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా అడుగులు వేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
లక్షల మెజారిటీతో గెలిచినా నో టికెట్- 39మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ - BJP drops sitting MPs