Police Save Life Within 6 Minutes:ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించాడు. దీంతో అందరిలో ఆందోళన చివరికి సమాచారం పోలీసులకు చేరింది. వెంటనే సాంకేతికతను ఉపయోగించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదంతా జరిగింది కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే. ముగ్గురు పోలీసులు ఆ కుటుంబానికి ఆపద్బాంధవులయ్యారు. వీరిని కోనసీమ ఎస్పీ బి.కృష్ణారావు అభినందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పి.గన్నవరం సీఐ భీమరాజు వివరించారు.
సోమవారం రాత్రి: అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు.
సరిగ్గా 11.21 గంటలకు: పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్ చేశారు.
11.22 గంటల సమయానికి: ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ సహాయంతో లోకేషన్‌ను కనిపెట్టారు. కానీ యువకుని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఫోన్ ఐఎంఈఐ ద్వారా సుమారు 106 కి.మీ. దూరంలో ఉన్న అన్నవరంగా గుర్తించారు.
11.24 కు: అన్నవరం ఎస్సై శ్రీహరిబాబుకు సీఐ భీమరాజు ఫోన్లో సమాచారం అందించి వీడియోతో పాటు లోకేషన్‌ను షేర్ చేశారు. ఫోన్లో మాట్లాడుతూనే లోకేషన్ ట్రేస్ చేయాలని సూచించారు. ఇంతలో ఎస్సై సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో పాటు వీడియోను స్థానిక లాడ్జిలకు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఓ లాడ్జి యజమాని ఎస్సైకు సమాచారం ఇచ్చారు.
11.27 గంటలకు: హుటాహుటిన లాడ్జికి వెళ్లిన ఎస్సై అమాంతం తలుపులను తీసుకుని ఉరివేసుకోబొయే యువకుడిని అడ్డుకుని మరీ ప్రాణాలను కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సూసైడ్ చేసుకుంటానని కొండ ఎక్కిన యువతి.. ఎస్ఐ ఎంట్రీతో..
డ్రైనేజ్‌లో పడిన వ్యక్తి.. మరో 2 నిమిషాలు లేట్ అయితే ప్రాణాలకే ప్రమాదం.. ఇంతలో...