Long-Term Maintenance of Roads For Monopolists In AP: రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాల అమలుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో కొన్ని రోడ్లను గుత్తేదారులకు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుండగా, మరికొన్ని రోడ్లలో నిర్వహణ దీర్ఘకాలంపాటు గుత్తేదారుకు అప్పగించి, వాటిలో ఎప్పటికప్పుడు పనులు చేయించడంపై అధ్యయనం చేస్తోంది.
దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్ట్ విధానంలో రోడ్లు దెబ్బతింటే వాటి మరమ్మతుల కోసం ప్రతిసారీ టెండర్లు పిలవకుండా ఎంపిక చేసిన గుత్తేదారుతో వెంటనే పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సంవత్సరానికి 1,300 కి.మీ. మొదలు: ఈ విధానంలో రద్దీ ఎక్కువగా ఉండే రహదారులలో సంవత్సరానికి 1,300 కిలోమీటర్లు చొప్పున వరుసగా మూడేళ్లపాటు 3,900 కి.మీ. గుర్తించి, వాటికి టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేయనున్నారు. కొన్ని రోడ్లపై గుంతలు పడి వర్షాలకు దెబ్బతిన్న వాటిని గుత్తేదారు మరమ్మతులు చేయాలి. వర్షాలకు చెట్లు కూలినా వెంటనే తొలగించాలి. రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగితే వాటి తొలగింపు బాధ్యతనూ అదే గుత్తేదారు చూస్తారు. ఆయా పనులను ఇంజినీర్లు పరిశీలించి, అనుమతులు ఇచ్చాక చేయాలి, చేసిన పనులకే చెల్లిస్తారు.
ఈ విధానంలో కిలోమీటరుకు ఏడాదికి రూ.10 లక్షల వరకు బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఇందులో భాగంగా మొదట సంవత్సరానికి రూ.130 కోట్లను, ద్వితీయ సంవత్సరానికి రూ.260 కోట్లను తృతీయ సంవత్సరంలో రూ.390 కోట్లుగా బడ్జెటును కేటాయిస్తుంది. బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటే, ఇక పదే పదే అనుమతులు తీసుకోకుండా గుత్తేదారుతో పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఐదు విధానాలు పరిశీలన: ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో మొదటి విడతగా 18 రాష్ట్ర రహదారులు, రెండోవిడతగా 68 రహదారుల అభివృద్ధి బాధ్యతలను గుత్తేదారులకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో ఐదు విధానాలు పరిశీలిస్తున్నారు. డిజైన్ చేసుకోవడం, నిర్మించడం, నిధులు వెచ్చించడం, నిర్వహించడం, బదలాయించడం (డీబీఎఫ్‌వోటీ), నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్), టోల్ వసూలు చేయు, నిర్వహించు, బదలాయించు (టీవోటీ), ఆపరేట్, నిర్వహించు, బదలాయించు (ఓఎంటీ) ఇలా ఐదింటిలో ఏది సరైనదో సలహా సంస్థ ద్వారా అధ్యయనం చేయిస్తున్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.
Contractor Questioned MLA: పెండింగ్ బిల్లులపై గుత్తేదారు ప్రశ్నలు.. మౌనం వహించిన ఎమ్మెల్యే