Andhra Pradesh Elections Counting: ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో ఘర్షణలు తలెత్తే అవకాశముందన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తవ్పవని హెచ్చరిస్తున్నారు.
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతర హింసను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించామని, కౌంటింగ్ సందర్భంగా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు 196 కౌంటింగ్ టేబుల్స్, 700 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని పల్నాడు జిల్లా కలెక్టర్ లఠ్కర్ శ్రీకేశ్ బాలాజీరావు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు.
"కౌంటింగ్ సజావుగా నిర్వహించడం ఇప్పుడు ఎంతో ముఖ్యమైన పని. శాంతియుతంగా కౌంటింగ్ పూర్తి చేయడంతో పాటు, కౌంటింగ్ తరువాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటం. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగాయి. వీటి కారణంగా జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రక్రియకి చెడ్డపేరు వచ్చింది. కౌంటింగ్ సమయంలో అలాంటివి జరగకుండా చూసుకుంటాం". - లఠ్కర్ శ్రీకేష్ బాలాజీరావు, పల్నాడు జిల్లా కలెక్టర్
తిరుపతిలో ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మరో రెండు కంపెనీల కేంద్ర బలగాలను రప్పించినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు వివరించారు. జిల్లాలో 144సెక్షన్ అమలులో ఉందని, కౌంటింగ్ కేంద్రం వద్ద 100 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు విజయవాడ సీపీ రామకృష్ణ తెలిపారు. బాటిల్స్‌లో పెట్రోల్ అమ్మకాలు నిషేధించాలని బంకుల యజమానులను ఆదేశించినట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు ఎలా ఉంటాయో ప్రజలకు పోలీసులు ప్రత్యక్షంగా చూపారు.
ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను ! - AP Elections 2024