Andhra Pradesh Asembly Sessions July 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి సర్కార్ సన్నద్ధమైంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున, మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనునట్లు సమాచారం. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. మరో మూడు శ్వేత పత్రాలైన శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు.
సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో సభకు రావాలని టీడీఎల్పీ సూచించింది.
సీట్ల సంఖ్య కేటాయింపు లేకుండానే సమావేశాలు : శాసన సభలో ఈసారి కూడా సభ్యులకు సీట్ల సంఖ్య కేటాయింపు లేకుండానే సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్ స్పీకర్‌కు గతంలోనే లేఖ రాసిన విషయం తెలిసిందే. శాసన సభ నిబంధనల మేరకు 11 సీట్లతో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా అవకాశం కోల్పోయింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు
ఇప్పటి వరకు స్పీకర్ అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపలేదు. ఈ సమావేశాలకూ సీట్ల కేటాయింపు జరిగే అవకాశం లేదంని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. సీట్ల కేటాయింపు జరపకపోవడంతో సామాన్య సభ్యుడుగానే శాసనసభలో మాజీ సీఎం జగన్ కూర్చోనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేళాలకూ విజిటర్స్ పాసులను కుదిస్తూ నిర్ణయించారు. ఎమ్మెల్యేల వెంట భారీ ఎత్తున అనుచరులు వస్తుండడంతో పాసులను నియంత్రించాలని నిర్ణయించారు. మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున అసెంబ్లీకి నేతలు, కార్యకర్తలు వస్తోడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ముగిశాక సచివాలయంలో సందర్శకులను కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా సిద్ధం కావాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు జగన్ దిల్లీ నాటకం: నాగబాబు - Naga Babu Fire on Jagan Comments