Liquor Shop Lottery Winner Kidnap in AP : ఏపీలో మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. రానివారు నిరాశలో ఉంటే వచ్చిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాని వారు వచ్చిన వారితో పొత్తుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకొందరైతే ఏకంగా లాటరీ వచ్చిన వారిని కిడ్నాప్ చేసే స్థాయికి వచ్చేశారు. అటుంవటి ఘటనే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చోటుచేసుకుంది. పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ ఈరోజు ఉదయం జరిగింది. ఈ సందర్భంగా హిందూపూర్ డివిజన్ సంబంధించిన లాటరీలో చిలమత్తూరులోని 57వ నెంబర్ దుకాణాన్ని రంగనాథ అనే వ్యక్తి దక్కించుకున్నాడు.
కిడ్నాప్ వార్తతో జిల్లాలో కలకలం : లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కాసేపటికే కిడ్నాప్‌కు గురయ్యాడు. మద్యం వ్యాపారి రంగనాథను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. మద్యం వ్యాపారి కిడ్నాప్ వార్త జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యర్థులే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
రంగనాథకు మద్యం షాపు దక్కడంతో పూర్తిగా తమకే ఇవ్వాలని లేదంటే, అందులో వాటా కోసం డిమాండ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రంగనాథ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను, సెల్‌ఫోన్ సిగ్నల్‌ను పరిశీలిస్తున్నారు. రంగనాథ కిడ్నాప్‌తో జిల్లాలో మద్యం లాటరీ దక్కిన ఇతర వ్యాపారులు అప్రమత్తమయ్యారు. తమను కూడా ఇలా కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందన్న భయంతో జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో మొత్తం 87 మద్యం షాపులకు 1074 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో కలెక్టర్ చేతన 87 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అందులో మహిళలు 60 మంది ఉన్నారు. మద్యం షాపులకు ఎంపికైన వారు 48 గంటల్లో డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
ఏపీలో 3,396 మద్యం దుకాణాలకు 90 వేలకు పైనే దరఖాస్తులు - ఆదాయం ఎంతో తెలుసా?
విదేశీ మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - బాటిల్‌కు రూ.10 అదనం